భార్యపై అనుమానం, ఆస్తి వివాదం.. ములుగు మండలం మల్లంపల్లిలో ఘటన

భార్యపై అనుమానం, ఆస్తి వివాదం.. ములుగు మండలం మల్లంపల్లిలో ఘటన
  • అత్తపై కత్తితో హత్యాయత్నం 

ములుగు, వెలుగు: భార్యపై అనుమానం, ఆస్తివివాదంతో అత్తపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం ఉదయం ములుగు మండలం మల్లంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన దూమల మానస, అదే గ్రామానికి చెందిన రాజేష్‌‌‌‌తో 13 ఏళ్ల కింద లవ్​ మ్యారేజ్​ చేసుకున్నారు. 

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజేష్ వేధింపులకు గురిచేయడంతో ఏప్రిల్ నుంచి మానస తన పుట్టింట్లో ఉంటోంది. గతంలో భార్య పేరు మీద భూమి, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిన రాజేష్ వాటిని తిరిగి తన పేరుపై మార్చాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అత్తగారింటికి వచ్చి గొడవపడి చంపుతానని బెదిరించాడు.

 మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొనుగోలు చేసిన కత్తితో అత్త బత్తిని లక్ష్మి (60) ఇంటికి చేరుకున్నాడు. ఆమె తలుపు తీయగానే మెడపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన భార్య మానసపై కూడా దాడికి ప్రయత్నించగా, ఆమె తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు కత్తితో పరారయ్యాడు. 

తీవ్రంగా గాయపడిన లక్ష్మిని కుటుంబ సభ్యులు హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. బత్తిని సురేశ్​ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై వెంకటేశ్​తెలిపారు.