మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆదివారం ఈ గురుకులాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ, విద్యార్థుల సమస్యలు, మౌలిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా తమకు క్రీడా సామగ్రి లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఎంపీ మంగళవారం తన అనుచరుల ద్వారా దాదాపు రూ.35 వేల విలువైన క్రీడా సామగ్రిని పంపించి అందజేశారు.
అంతకుముందు ఆకస్మిక తనిఖీలో భాగంగా తరగతి గదులు, హాస్టల్ వసతుల కొరతపై ఎంపీ స్పందిస్తూ, హాస్టళ్ల సమస్యలపై కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
సామగ్రి అందజేత కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు వసంత రెడ్డి, జావీద్ ఖాన్, మాలమహానాడు యూత్ జిల్లా అధ్యక్షుడు సకినాల ప్రశాంత్, ఎంపీ వంశీకృష్ణ టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు జాగిరి నగేశ్గౌడ్ పాల్గొన్నారు.
