- పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ సవాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 4 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఒక్క పెన్షన్ కూడా రాలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మంగళవారం గాంధీ భవన్‌లో కొనగాల మహేశ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌లో కౌశిక్ రెడ్డి ‘రీల్’, ‘సూసైడ్’, ‘ఆవేశం’ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అంటే భారత రాక్షస సమితి అని, అందులో కౌశిక్ ఒక రాక్షస పక్షిలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా తన క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి, ఇప్పుడు ఇలా మాట్లాడితే ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు.
