పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు వద్దు..రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ సందీప్ సూచన 

పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు వద్దు..రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ సందీప్ సూచన 

హైదరాబాద్, వెలుగు: పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరుపై ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ బీఎం సందీప్ భేటీ అయ్యారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లోని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గెస్ట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ సమావేశం వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

పార్టీ, ప్రభుత్వంపై వీరిద్దరూ వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను ఆయనకు వివరించారు. 

భవిష్యత్తులో మంచి బాధ్యతలు 

ఎమ్మెల్యేల వాదనలను సావధానంగా విన్న అనంతరం బీఎం సందీప్ పార్టీ హైకమాండ్ అభిప్రాయాన్ని వారికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనతోనే చర్చించాలని ఆయన సూచించారు. పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ‘‘పార్టీకి, ఏఐసీసీకి మీపై ఎంతో గౌరవం, మంచి అభిప్రాయం ఉన్నాయి. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు’’ అని ఆయన సున్నితంగా మందలించినట్టు సమాచారం. 

ముగిసిన బీఎం సందీప్ పర్యటన

బీఎం సందీప్ కుమార్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పీఏసీ సమావేశం నుంచి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీల వరకు పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. మంగళవారం ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.

ఇన్‌చార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందీప్‌కు ఎయిర్‌పోర్టుతో పాటు గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 22న గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదే రోజు సాయంత్రం పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 23న మంత్రులతో ముఖాముఖి సమావేశమైన సందీప్.. డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతోనూ విడివిడిగా చర్చించారు. 

26న మళ్లీ రాక.. 

ఈ నెల 26న సందీప్ మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంసద్ రక్షా మార్చ్‌లో పాల్గొంటారు. 27న హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు.