10 వేల కోట్లతో -ఎల్ నినోకు చెక్..కరువు ముప్పును ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్

10 వేల కోట్లతో -ఎల్ నినోకు చెక్..కరువు ముప్పును ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్
  • తెలంగాణ క్లైమేట్ కాన్‌‌‌‌క్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులకు ఆచరణాత్మకమైన, శాస్త్రీయమైన పరిష్కారాలను చూపేలా క్లైమేట్ కాంక్లేవ్ ఉండాలని అధికారులను ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్  ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ సమిట్ లో భాగంగా నిర్వహించనున్న తెలంగాణ క్లైమేట్ కాన్‌‌‌‌క్లేవ్ ఏర్పాట్లపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరువును తట్టుకునే సామర్థ్యం, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవడానికి తెలంగాణ సన్నద్ధత వంటి అంశాలపై లోతైన చర్చ జరగాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్లైమేట్-రెసిలియెన్స్ మోడల్స్‌‌‌‌తో పాటు ఇక్రిశాట్ గుర్తించిన అత్యుత్తమ విధానాలను ప్రెజెంటేషన్లు, ఆడియో-విజువల్ కంటెంట్‌‌‌‌లో చేర్చాలని ఆదేశించారు. కాగా ఈ క్లైమేట్ కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన రూ.10 వేల కోట్ల విలువైన 5 నెలల ఎల్ నినో ప్రిపేర్డ్‌‌‌‌నెస్ ప్రోగ్రాం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కింద నెలకు దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దీనిని నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తాయన్నారు. చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ విధానాల విస్తరణ, నీటి పొదుపు చర్యలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

తాగునీరు, ఆహార భద్రతకు ఢోకా లేదు

భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఎదురైనా తాగునీటి సరఫరాకు, ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాన్‌‌‌‌క్లేవ్ ప్రెజెంటేషన్లలో చూపించనున్నట్టు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలం వరకు రిజర్వాయర్లలో నీటి నిల్వలను కాపాడుకోవడానికి, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.