డ్రగ్స్ తయారీదారులే ఫస్ట్ టార్గెట్..పేదల కోసం పునరావాస కేంద్రాలను 2 వేలకు పెంచుతం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

డ్రగ్స్ తయారీదారులే ఫస్ట్ టార్గెట్..పేదల కోసం పునరావాస కేంద్రాలను 2 వేలకు పెంచుతం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • సర్కారు భూములమ్మకుండా ప్రతి ఊర్లో క్రీడా మైదానాలు కట్టాలి 
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నషా ముక్త్ భారత్ అనేది140 కోట్ల ప్రజలు భాగస్వాములయ్యే సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2029 నాటికి నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ తయారీదారులను నెంబర్–1 టార్గెట్‌‌‌‌గా, సరఫరాదారులను నెంబర్–2 టార్గెట్‌‌‌‌గా ఎంచుకుని ఉక్కుపాదం మోపుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విదేశీ శక్తులు డ్రగ్స్ సరఫరాతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌‌‌‌లోని అంబర్‌‌‌‌పేట, బోరబండ వంటి బస్తీల్లో పేద యువత గంజాయికి బానిసలై వీధి లైట్లు పగలగొడుతున్నారని మహిళలు తన వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలైన యువతను నేరస్థుల్లా చూడకూడదని, తల్లిదండ్రులు, టీచర్లు సానుభూతితో అక్కున చేర్చుకొని ఆ ఊబిలో నుంచి గౌరవప్రదంగా బయటకు తీసుకురావాలని సూచించారు.   

అవగాహన కల్పించడమే లక్ష్యం

సరిహద్దుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్‌‌‌‌లో ప్రత్యేక విభాగాలు, జాగిలాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ బానిసలైన పేద కుటుంబాల పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 300 పునరావాస కేంద్రాలను 2వేలకు పెంచుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించడంతో పాటు తొలి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. 

నేటి నుంచి ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర

డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే అనర్థాలపై యువత, సమాజంలో అవగాహన కల్పించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర జరగనుంది. 2029 నాటికి మాదకద్రవ్య రహిత భారత్ నిర్మించాలనే ప్రధాని మోదీ సంకల్పంలో భాగంగా ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కింద దీనిని చేపడుతున్నారు. ఈ నెల 27 వరకు సాగే ఈ యాత్ర బుధవారం అంబర్‌‌‌‌పేట్‌‌‌‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్‌‌‌‌లో ప్రారంభమై, జూబ్లీహిల్స్‌‌‌‌లో ముగియనుంది.