- కంపెనీల ఖాతాలు కళకళ
- నిఫ్టీ-500 సంస్థల ప్రాఫిట్స్ 32శాతం అప్
- గత 12 త్రైమాసికాల్లో ఇదే అత్యధికం
- 76 శాతం వృద్ధితో మెటల్స్ సెక్టార్ టాప్
- మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ రంగంలో లాభాల జోరు పెరుగుతోంది. కంపెనీల అమ్మకాలు, నిర్వహణ లాభాలతో పాటు నికర లాభాలు కూడా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. 2026-–27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిఫ్టీ-–500 సూచీలోని కంపెనీల నికర లాభాలు వార్షికంగా 32 శాతం పెరిగాయి. గత 12 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి కావడం విశేషం. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో ఈ కంపెనీల అమ్మకాలు 25 శాతం పెరిగాయి.
వడ్డీ, పన్నులు, తరుగుదల ఖర్చులకు ముందు లాభం 24 శాతం వృద్ధి చెందింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మినహాయించినా నికర లాభాల్లో 30 శాతం పెరుగుదల ఉంది. 2022–-23 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో లాభాల వృద్ధి కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మినహా నిఫ్టీ-–500 సంస్థల లాభాలు 27 శాతం పెరిగాయి. మెటల్స్ కంపెనీలు అత్యధికంగా 76 శాతం లాభాల వృద్ధితో అగ్రస్థానంలో నిలిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధరలు, మెరుగైన ప్రీమియంలు ఈ రంగానికి కలిసొచ్చాయి. ఈ కంపెనీల ఇబిటా మార్జిన్లు 2.8 శాతం పాయింట్లు పెరిగి 20.5 శాతానికి చేరాయి. చమురు, గ్యాస్ రంగంలో 61 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 20 శాతం లాభాల వృద్ధి నమోదైంది. ఈ మూడు రంగాలే నిఫ్టీ-500 కంపెనీల అదనపు లాభాల పెరుగుదలలో దాదాపు 68 శాతం వాటాను అందించాయి. ఇతర రంగాల్లోనూ మంచి ఫలితాలు కనిపించాయి.
యుటిలిటీస్ రంగంలో 46 శాతం, సిమెంట్‌లో 43 శాతం, ఆటోమొబైల్స్‌లో 34 శాతం, క్యాపిటల్ గూడ్స్‌లో 28 శాతం లాభాలు పెరిగాయి. బ్యాంకులు 20 శాతం, ఎన్‌బీఎఫ్‌సీలు 21 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కన్జూమర్ గూడ్స్ కంపెనీల లాభాలు 2 శాతమే పెరిగాయి. హెల్త్‌కేర్‌లో 13 శాతం, టెక్నాలజీ రంగంలో 10 శాతం వృద్ధి నమోదైందని రిపోర్ట్ తెలిపింది.
సత్తా చాటిన చిన్న కంపెనీలు
మార్కెట్ విలువ ఆధారంగా చూస్తే చిన్న కంపెనీలు 34 శాతం లాభాల వృద్ధితో పెద్ద కంపెనీలను అధిగమించాయి. లార్జ్‌క్యాప్ సంస్థల్లో 31 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 26 శాతం పెరుగుదల నమోదైంది. నిఫ్టీ-100 కంపెనీల లాభాలు 34 శాతం పెరగ్గా, నిఫ్టీ మిడ్‌క్యాప్-150లో 24 శాతం వృద్ధి కనిపించింది. నిఫ్టీ-500లో సగానికి పైగా కంపెనీలు 15 శాతానికి మించి లాభాల వృద్ధిని నమోదు చేశాయి. కేవలం 4 శాతం కంపెనీలే నష్టాలను ప్రకటించాయి.
కంపెనీల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటం కూడా లాభాల పెరుగుదలకు తోడ్పడింది. ఆర్థిక రంగ సంస్థలను మినహాయించిన నిఫ్టీ-500 కంపెనీల ఇబిటా మార్జిన్లు 0.2 శాతం పాయింట్లు పెరిగి 17.4 శాతానికి చేరాయి. ముడిసరుకు ఖర్చులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు భవిష్యత్తులో కంపెనీల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
