- కార్ల రేట్లు పైపైకి ధరలు పెంచుతున్న కంపెనీలు..
- మారుతి ధరలు రూ.6,200 వరకు జంప్
- వచ్చే నెల నుంచి టాటా, హ్యందాయ్ పెంపు
- ముడి సరుకుల ధరలు పెరగడమే కారణం
న్యూఢిల్లీ: పండుగ సీజన్ ముగియడంతో ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ధరలు గరిష్టంగా రూ.6,200 వరకు పెరిగాయి. కంపెనీ ఈ నెల 22 నుంచే ధరల పెంపును అమలు చేయగా, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా డిసెంబర్ నుంచి ధరలను పెంచనున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా 2027 జనవరి నుంచి ధరలను సవరించనుంది.
ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతోంది. అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ లాభాల శాతం తగ్గుతుండటంతో ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పడం లేదని కంపెనీలు పేర్కొన్నాయి. మారుతీ సుజుకీ తన ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం ధరను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికర లాభం 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లుగా నమోదైంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల తయారీ వ్యయం పెరగడమే ఇందుకు కారణమని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
తగ్గిన లాభాలు
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తమ కార్లు, ఎస్‌యూవీల ధరలను సగటున 0.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) కూడా ఈ పెంపు వర్తిస్తుందని, ఇది 2026 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. అంతకుముందు ఏప్రిల్ లో 0.5 శాతం, జూలైలో 1.5 శాతం, సెప్టెంబర్ లో రూ.25 వేల వరకు ధరలను పెంచింది.
హ్యుందాయ్ కూడా డిసెంబర్ 1 నుంచి ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 వరకు ధరలను పెంచనుంది. తయారీ వ్యయం భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో పెంచిన 0.4 శాతంతో కలిపి ఇప్పటివరకు మొత్తం 1.4 శాతం ధరలను పెంచింది. హ్యుందాయ్ నికర లాభం కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం తగ్గింది. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా 2027 జనవరి నుంచి తమ వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరలను 2 శాతం వరకు పెంచనుంది.
పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను తట్టుకోవడానికి ఈ పెంపు అనివార్యమని ఆడి తెలిపింది. 2026లో ఆడి ధరలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్‌లో 2 శాతం ధరలను పెంచింది. అన్ని మోడళ్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది.
