హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆ సంస్థ స్టేక్ హోల్డర్లు అర్శద్ అయూబ్, జాన్ మనోహర్ డిమాండ్ చేశారు. పారదర్శకమైన పాలన పునరుద్ధరణ కోసం వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎం) ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలోని పర్యవేక్షక కమిటీ (ఎస్ఎంసీ)కి 19 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం ముగిసినందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎస్ఎంసీకి అధికారికంగా ఈమెయిల్ పంపినా స్పందన లేదని అర్శద్ అయూబ్ ఆరోపించారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం 45 రోజుల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిర్దిష్ట సంఖ్యలో సమావేశాలకు హాజరైన అనుభవం ఉండాలని సూచించారు. సెలెక్టర్ల అర్హతలకు సంబంధించిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. సెలెక్టర్లు, కోచ్ లు, సిబ్బంది విషయంలో ప్రయోజనాల సంఘర్షణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీసీసీఐ నుంచి రావాల్సిన నిధుల కోసం ఆర్థిక ఖాతాలను ఆమోదించేలా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించాలని కోరారు.
