హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఆఫీసులు, స్కూళ్లలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చర్యలు చేపట్టింది. పనిప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అన్ని ఆఫీసుల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం–2013 నిబంధనల ప్రకారం ఈ కమిటీలు వేయాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతులు (హెచ్‌వోడీలు), హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్‌జేడీలు), అన్ని జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు తమ పరిధిలో ఐసీసీలను ఏర్పాటు చేయాలని సూచించింది. డీఈవోల ద్వారా ఎంఈవోలకు, ఎంఈవోల ద్వారా హెచ్‌ఎంలకు ఈ ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత, ఆ వివరాలను స్టేట్ ఆఫీసుకు సమర్పించాలని ఆదేశించింది.
