- ఇప్పటికే భూభారతిలో కొన్ని సేవలకు ఆంక్షలు.. ఈ-ఆఫీస్‌లోనూ అంతరాయం
- భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, టీజీఐఐసీ, జీఎస్టీ, ఫైనాన్స్ పోర్టళ్ల ఫైర్ వాల్స్ పటిష్ఠతకు ఆదేశాలు
- ఏఐ బాట్లతో సైట్లలోకి చొరబడుతున్నట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ కీలక వెబ్‌సైట్లు, డిజిటల్ పోర్టళ్లకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో ఐటీ, సైబర్ సెక్యూరిటీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆధునిక ఏఐ బాట్ల సాయంతో గుర్తుతెలియని ముఠాలు ప్రభుత్వ సర్వర్లు, పోర్టళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అన్ని శాఖలకు సైబర్ భద్రతపై హెచ్చరికలు జారీ చేశారు.
కీలక పోర్టళ్లలో ఫైర్‌వాల్‌లను పటిష్ఠం చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ముఖ్యంగా భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, టీజీఐఐసీ, జీఎస్టీ, ఫైనాన్స్, ఈ-ఆఫీస్ వంటి కీలక వ్యవస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఇప్పటికే భూభారతి పోర్టల్‌లో కొన్ని సేవలపై ఆంక్షలు విధించగా, ఈ-ఆఫీస్‌లోనూ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పౌరుల డేటా, ఆర్థిక లావాదేవీలు, భూముల రికార్డుల భద్రత కోసం సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి శాఖ నోడల్ అధికారి స్థాయిలో భద్రతా తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు.
ఫైర్‌వాల్‌ల పటిష్ఠతకు చర్యలు..
సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు ఐటీ విభాగం, సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయి. ప్రతి పోర్టల్ వద్ద ఫైర్‌వాల్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు అనుమానాస్పద ట్రాఫిక్‌ను బ్లాక్ చేసేలా వ్యవస్థలను అప్‌డేట్ చేస్తున్నారు. ఏఐ బాట్ల కదలికలను గుర్తించేందుకు అధునాతన మానిటరింగ్ టూల్స్ వినియోగిస్తున్నారు. అనధికారిక లాగిన్ ప్రయత్నాలను విశ్లేషిస్తూ సర్వర్ లాగ్‌లను పరిశీలిస్తున్నారు.
డేటా బ్యాకప్ వ్యవస్థలను పక్కాగా నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో సేవలను త్వరగా పునరుద్ధరించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు అనుమానాస్పద లింకులు, ఈమెయిళ్లు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ఆధారపడే ప్రజలు, వ్యాపారులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు ఈ పరిణామాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భూభారతి సేవలపై ఆంక్షలు, ఈ-ఆఫీస్‌లో అంతరాయంతో భూముల పనులు, దస్త్రాల ఆమోదంలో జాప్యం జరగవచ్చని భావిస్తున్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, జీఎస్టీ, ఫైనాన్స్ పోర్టళ్లలో భద్రతా తనిఖీల వల్లా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సైబర్ ఆడిట్‌లు నిర్వహించడంతో పాటు ఐటీ సిబ్బందికి కొత్త ముప్పులపై శిక్షణ ఇవ్వాలని, అత్యవసర స్పందన బృందాలను సిద్ధంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏఐ బాట్లతో చొరబాటు యత్నాలు..
ప్రభుత్వ శాఖల డిజిటల్ వ్యవస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సాంకేతిక నిపుణులు పలు అంశాలను గుర్తించారు. సాధారణ హ్యాకింగ్ పద్ధతులకు భిన్నంగా వేగంగా స్పందించే ఆటోమేటెడ్ ఏఐ బాట్లతో పోర్టళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పారిశ్రామిక, ఆర్థిక శాఖల డేటాబేస్‌లపై కన్నేసినట్లు భావిస్తున్నారు.
భూభారతిలో భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ల సమాచారం సున్నితమైనది కావడంతో కొన్ని సేవలను తాత్కాలికంగా నియంత్రించారు. ఈ-ఆఫీస్‌లో అంతరాయంతో ఉద్యోగులు, అధికారుల పనితీరుపై ప్రభావం పడింది. జీఎస్టీ, ఫైనాన్స్ విభాగాల్లో ఆర్థిక లావాదేవీల డేటా ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. టీజీఐఐసీ సర్వర్లపైనా ప్రత్యేక నిఘా పెట్టారు.
