జనవరిలో  మూసీ ఫేజ్ 1..  టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టామన్న సీఎం

జనవరిలో  మూసీ ఫేజ్ 1..  టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టామన్న సీఎం
  •   హిమాయత్‌‌‌‌సాగర్, ఉస్మాన్‌‌‌‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ దాకా 21 కిలోమీటర్లు
  •     కూకట్‌‌‌‌పల్లి-బయోడైవర్సిటీ, బేగంపేట-రాణిగంజ్ మధ్య పీఆర్‌‌‌‌టీఎస్
  •     మీరాలం చెరువు పనులు 2028 జనవరి నాటికి పూర్తి
  •     మార్చి కల్లా గండిపేట గోశాల సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి
  •     ట్రిపుల్‌‌‌‌ ఐటీ జంక్షన్‌‌‌‌ వద్ద ఫుట్‌‌‌‌ బ్రిడ్జి.. కోహెడ మార్కెట్‌‌‌‌కు సమాంతరంగా రోడ్లు
  •     చెరువుల పునరుద్ధరణకు ఎస్టీపీలు.. మెట్ల బావుల రక్షణకు చర్యలు
  •     మున్సిపల్, పట్టణాభివృద్ధిపై  సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
     

హైదరాబాద్, వెలుగు:మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తొలి దశ పనులు వచ్చే జనవరిలో మొదలుకానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఫేజ్–1లో హిమాయత్‌‌‌‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1ఏగా, ఉస్మాన్‌‌‌‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్–1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. మంగళవారం ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌‌‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ (ప్యూర్) ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  


మీరాలం చెరువు అభివృద్ధి పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెప్పగా, చెరువులో ఏండ్లుగా పేరుకుపోయిన పూడికను కూడా తొలగించాలని సీఎం ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని తెలుసుకుని పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. గండిపేట దగ్గర నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాలను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

రెండు మార్గాల్లో పీఆర్‌టీఎస్

సిటీలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పాడ్ ట్యాక్సీ) ఫేజ్–1కు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సీఎంకు వివరించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం మీదుగా బయోడైవర్సిటీ వరకు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియెట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు అలైన్‌మెంట్ ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలను తెలిపారు. నెక్లెస్ రోడ్, రాయదుర్గం, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలకు అనువైన స్థలాలు గుర్తించి అధ్యయనం చేయాలని, డిపోల దగ్గర మల్టీలెవెల్ పార్కింగ్ ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. రూట్లు, డిపోలు సహా అన్ని అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే ప్రణాళికలు ఖరారు చేయాలన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర ఫుట్‌బ్రిడ్జి డిజైన్లను పరిశీలించిన సీఎం, దాని సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

కోహెడ మార్కెట్‌లో నాణ్యతపై రాజీ వద్దు

కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగం పెంచాలని, మార్కెట్ పనులతో పాటే రోడ్ల నిర్మాణమూ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పనుల వివరాలు తెలుసుకున్నారు. చెరువుల దగ్గర అవసరమైన చోట మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించగా, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, సిటీలోని మెట్ల బావుల పునరుద్ధరణకూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.