తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బ్రేకులు.. పట్టాలెక్కని 11 ప్రధాన ప్రాజెక్టులు!

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బ్రేకులు.. పట్టాలెక్కని 11 ప్రధాన ప్రాజెక్టులు!
  • రీజినల్ రింగ్ రైల్ నుంచి బుల్లెట్ రైలు దాకా ఆమోదం కోసం ఎదురుచూపులు
  • సర్వేలు, డీపీఆర్‌‌‌‌లు రెడీగా ఉన్నా ససేమిరా..నిధుల కేటాయింపులో తాత్సారం
  • వికారాబాద్ -కృష్ణా లైన్‌‌‌‌కు భూసేకరణ ఖర్చు భరిస్తామని రాష్ట్ర సర్కారు లేఖలు
  • రూ.11,517 కోట్లతో నార్త్ రింగ్ రైల్.. డోర్నకల్- గద్వాలకు 8,993 కోట్ల ప్రతిపాదనలు
  • కల్వకుర్తి~మాచర్ల, కాచిగూడ~జగ్గయ్యపేట ప్రాజెక్టులపై రైల్వే బోర్డు మీనమేషాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 11 కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం వద్ద మోక్షం కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే విభాగం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్), తుది లొకేషన్ సర్వేలు పూర్తి చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి తుది అనుమతులు లభించడం లేదు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్వయంగా రైల్వే మంత్రికి, బోర్డుకు పలుమార్లు లేఖలు రాస్తూ.. ప్రాజెక్టులను 100 శాతం రైల్వే నిధులతో మంజూరు చేయాలని కోరినా సరైన స్పందన కరువైంది.

ముఖ్యంగా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ మీదుగా వెళ్లే ‘వికారాబాద్ – కృష్ణా జంక్షన్’ 130.28 కి.మీ. లైన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి భూసేకరణ ఖర్చును భరించేందుకు 2025 అక్టోబర్ 27న అంగీకారం తెలిపింది. రూ.2,331.10 కోట్ల నిర్మాణ వ్యయంతో తుది డీపీఆర్‌‌‌‌ను ఈ ఏడాది ఆగస్టు 13న రైల్వే బోర్డుకు సమర్పించింది. అయినా నేటికీ అనుమతి ఇవ్వకపోవడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

రైల్వే లైన్లు కేంద్రం వద్దే పెండింగ్‌‌‌‌

 భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు 335 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన భారీ కనెక్టివిటీ రైల్వే లైన్ ఫైల్ కేంద్రం వద్దే పెండింగ్‌‌‌‌ పడింది. ఈ లైన్‌‌‌‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం దక్షిణ మధ్య రైల్వే 2025 సెప్టెంబర్ 25న రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపగా, నేటికీ సర్వేకు అనుమతి రాలేదు.

ఈ ప్రాజెక్టును 100 శాతం రైల్వే వ్యయంతో చేపట్టాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇక,  హైదరాబాద్ చుట్టూ 361 కి.మీ. పొడువుతో నిర్మించతలపెట్టిన  ‘రీజినల్ రింగ్ రైల్ (ఆర్ఆర్ఆర్)’ ప్రాజెక్టును రెండు భాగాలుగా ప్రతిపాదించగా.. ఉత్తర భాగం  - 222.53  కి.మీ. పరిధిలో మూడు రైల్ ఓవర్ రైల్ (ఆర్‌‌‌‌వోఆర్)లతో కూడిన రూ.11,517.51 కోట్ల డీపీఆర్‌‌‌‌ను రైల్వే బోర్డుకు సమర్పించారు.

ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ (పీఈసీ) స్టేజ్-1 క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ బోర్డు నుంచి పూర్తిస్థాయి ఆమోదం లభించలేదు. ఇక దక్షిణ భాగానికి 199.60  కి.మీ.కు సంబంధించి ఎన్‌‌‌‌హెచ్ఏఐతో సమన్వయం చేసుకుంటూ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఖరారు చేసేందుకు మరింత టైం పడుతున్నది.

కాగితాలకే కారిడార్ల ప్రతిపాదనలు పరిమితం

తెలంగాణను పొరుగు రాష్ట్రాల మెట్రో నగరాలతో అనుసంధానించే సెమీ హైస్పీడ్, హైస్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. హైదరాబాద్ – బెంగళూరు (576.60 కి.మీ), హైదరాబాద్ – చెన్నై 744.50 కి.మీ, హైదరాబాద్ -ముంబై మార్గాల్లో హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఈ పనులను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌‌‌‌హెచ్ఎస్ఆర్​సీఎల్)కు అప్పగించారు.

హైదరాబాద్~చెన్నై కారిడార్ అలైన్‌‌‌‌మెంట్ ఖరారు కాగా, హైదరాబాద్~బెంగళూరు మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పుల ఆధారంగా డీపీఆర్ తయారీ బాధ్యతలను రైట్స్ సంస్థకు కట్టబెట్టారు. గిరిజన ప్రాంతాలకు కీలకమైన భద్రాచలం రోడ్~కొవ్వూరు ప్రాజెక్టులో భాగంగా సత్తుపల్లి~జీలుగుమిల్లి 48.59 కి.మీ. లైన్‌‌‌‌ను సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 118.90 కి.మీ. మేర సవరించిన అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌తో రూ.2,867.99 కోట్ల అంచనాతో  చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే 2026 జనవరి 23న కోరినా రైల్వే బోర్డు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. 

భారీ ప్రాజెక్టులపై రాష్ట్రమే ముందడుగు 

దక్షిణ తెలంగాణ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని డోర్నకల్~గద్వాల 296 కి.మీ భారీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందడుగు వేసింది. గతంలో ప్రతిపాదించిన రెండు అలైన్‌‌‌‌మెంట్లను రద్దు చేసి సరికొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. ఉయ్యాలవాడ, వెన్నెరం, మన్నెగూడెం, సంకేస, సీరోలు, అబ్బయ్యపాలెం, మరిపెడ, మోతే మీదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేఖ రాశారు.

ఈ మార్గానికి సంబంధించి రూ.8,993.77 కోట్ల అంచనాతో కూడిన డీపీఆర్‌‌‌‌ను 2026 మార్చి 31న రైల్వే బోర్డుకు సమర్పించారు. డోర్నకల్ వద్ద భద్రాచలం, వరంగల్ లైన్లను కలుపుతూ ఆర్‌‌‌‌వోఆర్ నిర్మాణానికి బోర్డు సూచించడంతో ఫీల్డ్ సర్వే, అంచనాల తయారీ కొనసాగుతోంది.  

ఆదిలాబాద్ ప్రాజెక్టులో కేంద్రం మెలిక 

ఉత్తర తెలంగాణకు జీవనాడి లాంటి పటాన్‌‌‌‌చెరు~ఆదిలాబాద్ 320 కి.మీ ప్రాజెక్టులో కేంద్రం మెలిక పెట్టింది. ఈ లైన్‌‌‌‌ను రెండు భాగాలుగా విభజించగా.. పటాన్‌‌‌‌చెరు–బోధన్ 115 కి.మీ మార్గానికి డీపీఆర్ తయారవుతుండగా, ఆర్మూర్ – ఆదిలాబాద్ 136.50 కి.మీ మార్గానికి రూ.4,398.73 కోట్ల వ్యయంతో 2025 అక్టోబర్ 6న డీపీఆర్ సమర్పించారు. అయితే వ్యయాన్ని తగ్గించేందుకు అలైన్‌‌‌‌మెంట్ మార్చాలని ఎస్‌‌‌‌సీఆర్ ప్రతిపాదించడంతో పాటు.. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా భరించాలని రైల్వే శాఖ ప్రతిపాదించడంతో ఇది పెండింగ్‌‌‌‌లో పడింది.

మహారాష్ట్ర సరిహద్దును కలిపే బోధన్– లాతూర్ రోడ్డు 128.46 కి.మీ - తెలంగాణలో 18.39 కి.మీ, మహారాష్ట్రలో 110.07 కి.మీ  ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,886.84 కోట్ల వ్యయంతో 2025 సెప్టెంబర్ 29న డీపీఆర్ సమర్పించినప్పటికీ, ఇందులోనూ కాస్ట్ షేరింగ్ వివాదం తేలకపోవడంతో అనుమతులు నిలిచిపోయాయి. పాండురంగాపురం– భద్రాచలం రోడ్డు 13 కి.మీ మార్గాన్ని మాత్రం రైల్వే బోర్డు మంజూరు చేయగా, మల్కన్‌‌‌‌గిరి - భద్రాచలం ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రస్తుతం నిర్మాణ పనులను చేపడుతోంది.