తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఇకపై SSC మెమోలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి విద్యార్థులు విద్యాశాఖ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీసేవ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేసుకోవచ్చు.
గతంలో పదో తరగతి మెమోలో పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకోవడానికి విద్యార్థులు నేరుగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డును సంప్రదించాల్సి వచ్చేది. అవసరమైన డాక్యూమెంట్లతో ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత ఈజీ చేస్తూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు.
మీసేవ ద్వారా SSC మెమోలో తప్పులు ఎలా సరిచేయించుకోవాలి?
మీ పదో తరగతి మెమోలో ఏవైనా వివరాలు తప్పుగా నమోదైతే, ముందుగా దగ్గరలోని మీసేవ సెంటరుకి వెళ్లాలి. అక్కడ మెమోలో సరిచేయాల్సిన వివరాలను తెలియజేసి, అందుకు సంబంధించిన సరైన ఆధారాలను సమర్పించాలి. మీ వివరాలు, పేపర్లతో మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఈ దరఖాస్తు మీరు పదో తరగతి చదివిన స్కూలుకు వెళ్తుంది.
స్కూల్ ప్రధానోపాధ్యాయుడి పరిశీలన
మీసేవలో దరఖాస్తు చేసిన తర్వాత అది విద్యార్థి చదివిన స్కూలుకు చేరుతుంది. అక్కడ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ దరఖాస్తును పరిశీలిస్తారు. విద్యార్థి సబ్మిట్ చేసిన ఆధారలను చెక్ చేసి, అవసరమైన డాక్యూమెంట్లను వారి వ్యాఖ్యలతో పాటు ISMS పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత దరఖాస్తు ఫైనల్ స్థాయికి వెళ్తుంది.
మండల విద్యాధికారి పరిశీలన
స్కూల్ ప్రధానోపాధ్యాయుడు డాకుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు మండల విద్యాధికారి (MEO) వద్దకు వెళ్తుంది. విద్యార్థి సమర్పించిన వివరాలు, ఆధారలను పరిశీలించిన తర్వాత MEO దరఖాస్తును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఆ తర్వాత ఎవరెవరు ఆమోదించాలి?
మండల విద్యాధికారి ఆమోదం పొందిన తర్వాత దరఖాస్తు అక్కడితో పూర్తికాదు. మరికొన్ని స్థాయిల్లో అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
స్కూల్ ప్రధానోపాధ్యాయుడు: విద్యార్థి వివరాలు, ఆధారాలను పరిశీలించి అప్‌లోడ్ చేస్తారు.
మండల విద్యాధికారి (MEO): దరఖాస్తును పరిశీలించి ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు.
జిల్లా విద్యాశాఖ అధికారి (DEO): తరువాత స్థాయిలో దరఖాస్తును పరిశీలిస్తారు.
స్కూల్ విద్యాశాఖ డైరెక్టర్: దరఖాస్తును పరిశీలించి ముందుకు పంపిస్తారు.
ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్: చివరిగా తుది ఆమోదం ఇస్తుంది.
ఆమోదం వస్తే SSC మెమోలో వివరాలు అప్‌డేట్
అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయి, చివరి ఆమోదం లభించిన తర్వాత విద్యార్థి SSC మెమోలో కోరిన మార్పులు చేస్తారు. దీంతో సరిచేసిన వివరాలతో మెమో పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ అయితే అందుకు కారణాన్ని సంబంధిత అధికారులు తెలియజేయాలి.
చివరికి పదో తరగతి మెమోలో తప్పులు ఉన్న విద్యార్థులకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ఉపయోగకరంగా ఉంటుంది. గతంలోలాగా ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మీసేవ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత అధికారుల ఆమోదంతో వివరాలను సరిచేసుకోవచ్చు
