ఒకప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు! ఒక పాత్రలో కొత్త నటుడిని ఊహించుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చు. కానీ తన నటనతో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేయొచ్చని నిరూపించాడు యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి. ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat)లో కార్తీక్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాయి సుశాంత్ రెడ్డి పోషించిన కార్తీక్ పాత్రకు తనదైన శైలిలో న్యాయం చేస్తూ.. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. దీంతో సినిమా విడుదలకు ముందు ఎదురైన ట్రోలింగ్ కాస్తా ఇప్పుడు ప్రశంసలుగా మారింది. ఈ సినిమాతో శ్రీనాథ్‌కు నటుడిగా మంచి గుర్తింపు రావడమే కాకుండా.. హీరోగా మరిన్ని అవకాశాలకు బాటలు పడుతున్నాయి.
విమర్శలకు నటనతోనే సమాధానం..
‘ఈ నగరానికి ఏమైంది’ మొదటి భాగంలో కార్తీక్‌గా సుశాంత్ రెడ్డి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. దీంతో సీక్వెల్లో ఆ పాత్రను శ్రీనాథ్ మాగంటి పోషిస్తాడని ప్రకటించగానే పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ENE Repeat’లో శ్రీనాథ్ తన నటనతో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. కామెడీ టైమింగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కెమిస్ట్రీ, శివాత్మికతో ట్రాక్‌తో ఆకట్టుకున్నాడు. మొదట్లో వచ్చిన ట్రోలింగ్‌ను పటాపంచలు చేస్తూ కార్తీక్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన నటన నచ్చకపోతే మరో నటుడిని తీసుకోవాలని మేకర్స్ భావించారని, అయినా సినిమాలో భాగం కావడమే తనకు పెద్ద గుర్తింపు అని శ్రీనాథ్ చెప్పడం విశేషం.
‘హిట్’, ‘యానిమల్’ నుంచి ‘ENE Repeat’ వరకు..
శ్రీనాథ్ మాగంటి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కాదు. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’, ‘యానిమల్’, ‘లక్కీ భాస్కర్’, ‘హిట్: ది థర్డ్ కేస్’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘యానిమల్’లో కార్తీక్‌గా, ‘లక్కీ భాస్కర్’లో సూరజ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘మెన్షన్ హౌస్ మల్లేష్’తో సోలో హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. తాజాగా ‘ENE Repeat’లో కార్తీక్ పాత్రతో మరోసారి తన నటనను నిరూపించుకుని కెరీర్లో ముందడుగు వేశాడు.
సోలో హీరోగా మరిన్ని సినిమాలు..
‘ENE Repeat’తో వచ్చిన గుర్తింపు శ్రీనాథ్ మాగంటి కెరీర్‌కు కొత్త ఊపునిస్తోంది. ఇప్పటికే సోలో హీరోగా కొన్ని కథలు వింటున్న అతడు.. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల చర్చల్లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయా సినిమాల దర్శకులు, నిర్మాణ సంస్థల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా సోలో హీరోగానూ తన సత్తా చాటాలని శ్రీనాథ్ భావిస్తున్నాడు.
రూ.50 కోట్లకు చేరువలో ‘ENE Repeat’..
‘ENE Repeat’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. వీకెండ్లో మరింత జోరు చూపించింది. వరల్డ్‌వైడ్‌గా రూ.40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల టాక్. దీంతో మూవీ రూ.50 కోట్ల మార్క్‌కు చేరువైంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ నుంచి వస్తున్న స్పందన సినిమాకు ప్లస్ అవుతోంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమాగా బజ్ తెచ్చుకోవడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
