నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ సిరీస్‌పై AICWA ఫైర్.. భారత్‌లో బ్యాన్ చేయాలంటూ మోదీకి లేఖ!

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ సిరీస్‌పై AICWA ఫైర్.. భారత్‌లో బ్యాన్ చేయాలంటూ మోదీకి లేఖ!

పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్‌ నటించిన వెబ్ సిరీస్ 'జో బచాయే హై సంగ్ సమేట్'. వీరిద్దరితో పాటు పాక్‌కు చెందిన స్టార్ నటీనటులంతా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ ఊహించని వివాదం మొదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4న స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న ఈ సిరీస్ ను భారత్ లో పూర్తిగా నిషేధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది.  

ఈ మేరకు నవంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీకి  ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పాకిస్థానీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు ప్రసారం కాకుండా శాశ్వత చట్టం తీసుకురావాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు విధించాలని కూడా విజ్ఞప్తి చేసింది.

2025 మే 8న పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ను నిలిపివేయాలని ఓటీటీ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సిరీస్‌ను భారత్‌లో ప్రసారం చేయడం ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని AICWA వాదిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది.

ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన బెస్ట్ సెల్లింగ్ ఉర్దూ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. మూడు తరాలకు చెందిన ఆరు ప్రేమకథలు, కుటుంబ బంధాలు, విఫలమైన వివాహాలు, భావోద్వేగ సంఘర్షణలు ఇందులో ప్రధాన  చూపించనున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్ విద్యార్థి సికందర్, లిజా అనే కళాకారిణి జీవితాల చుట్టూ కథలోని కీలక భావోద్వేగాలు సాగుతాయి. 

మొమినా దురైద్ నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్‌ను పాకిస్థాన్‌తో పాటు ఇటలీ, బ్రిటన్‌లోనూ చిత్రీకరించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సిరీస్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.  ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.