కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? టాటా నుండి ఆడి వరకు పెరగనున్న కార్ల ధరలు!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? టాటా నుండి ఆడి వరకు పెరగనున్న కార్ల ధరలు!

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకో ముఖ్యమైన విషయం. దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీలు  కార్ల ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతి సుజుకి, ఆడి సంస్థలు ధరల పెంపును ప్రకటించాయి. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. కొన్ని కంపెనీల ధరల పెంపు 1 డిసెంబర్ 2026 నుంచి అమల్లోకి రానుండగా, మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలను సవరించాయి. మరి ఏ కంపెనీ కార్ల ధరలు ఎంత పెరుగుతున్నాయి ? కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుసుకుందాం....

టాటా కార్ల ధరలు  
టాటా మోటార్స్  పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల ధరలను కూడా పెంచుతోంది. మొత్తం కార్ల విభాగంలో సగటున 0.5 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే అన్ని మోడళ్లపై ఒకే స్థాయిలో ధరలు పెరగవు. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయి. పెరుగుతున్న ఖర్చుల్లో కొంత భారాన్ని కంపెనీ భరిస్తున్నప్పటికీ, మిగిలిన కొంత మొత్తాన్ని కస్టమర్లపై వేయాల్సి వస్తోందని టాటా మోటార్స్ తెలిపింది.

హ్యుందాయ్ కార్ల ధరలు  
హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా  కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెలెక్ట్ చేసిన మోడళ్లు, వేరియంట్లపై గరిష్టంగా రూ.8,000 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెంపు కూడా 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటోందని, అయినప్పటికీ కొంత భారాన్ని కస్టమర్లపై వేయాల్సి వస్తోందని తెలిపింది.

ఆడి కార్ల ధరలు  
లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి కూడా ధరల పెంపు తప్పడం లేదు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపై గరిష్టంగా 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. దీంతో ఆడి కార్లు కొనాలనుకునేవారు కొత్త ఏడాది నుంచి ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.

మారుతి కార్ల ధరలు  
దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే మారుతి సుజుకి కూడా ధరలను సవరించింది. 2026 నవంబర్ 22 నుంచే సెలెక్ట్ చేసిన మోడళ్లు, వేరియంట్లపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా చూస్తే సగటున 0.31 శాతం ధరలు పెరిగినట్లు కంపెనీ అంచనా వేసింది. తయారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కొంత భారాన్ని కస్టమర్లపై వెయాల్సి వచ్చిందని మారుతి సుజుకి తెలిపింది. అయితే కస్టమర్లపై ధరల పెంపు ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

కొత్త కారు కొనేవారు ఈ విషయం గుర్తుంచుకోండి!
నాలుగు ప్రముఖ కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్న నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఆడి కార్ల ధరలు జనవరి 1 నుంచి పెరుగుతాయి. అయితే ధరల పెంపు అన్ని మోడళ్లకు ఒకేలా ఉండదు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీకు నచ్చిన మోడల్, వేరియంట్ కొత్త ధరలను సంబంధిత కంపెనీ డీలర్ వద్ద తెలుసుకోవడం మంచిది.