రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలామంది లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించేవారు కింది బెర్త్ ఉంటే సౌకర్యంగా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే పై బెర్త్ ఎక్కడం, దిగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే లోయర్ బెర్త్ అయితే హాయిగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. సామాను తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అయితే IRCTCలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ సెలెక్ట్ చేసినంత మాత్రాన కచ్చితంగా అదే బెర్త్ వస్తుందని అనుకోకూడదు. బెర్త్ కేటాయింపు అనేది అందుబాటులో ఉన్న సీట్లు, రైల్వే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
అయితే టికెట్ బుక్ చేసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే లోయర్ బెర్త్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...అవేంటో తెలుసుకుందాం.
బెర్త్ ప్రిఫరెన్స్‌లో లోయర్ బెర్త్
IRCTC వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేసే సమయంలో 'Berth Preference' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కింది బెర్త్ కావాలంటే 'Lower Berth' సెలెక్ట్ చేసుకోవాలి. మీతో పాటు ప్రయాణించే ప్రతి ఒక్కరికీ విడివిడిగా బెర్త్ ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా వృద్ధుల కోసం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు వారి పేరుపై లోయర్ బెర్త్ సెలెక్ట్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. లోయర్ బెర్త్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన అదే కేటాయిస్తారని హామీ లేదు. అందుబాటులో ఉన్న బెర్త్‌లను బట్టి రైల్వే అధికారులు కేటాయిస్తారు.
రిజర్వేషన్ ఆప్షన్లను కూడా
IRCTCలో టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో 'Reservation Choice' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో లోయర్ బెర్త్‌కు సంబంధించిన ప్రత్యేక అప్షన్స్ ఉండవచ్చు.
ఉదాహరణకు, కనీసం ఒక లోయర్ బెర్త్ కేటాయిస్తేనే టికెట్ బుక్ చేయాలని లేదా ఇద్దరు ప్రయాణికులకూ లోయర్ బెర్త్‌లు లభిస్తేనే బుకింగ్ చేయాలని కొన్ని అప్షన్స్ ఉండవచ్చు. ఇలాంటి ఆప్షన్లు కనిపించినప్పుడు వాటిని జాగ్రత్తగా చదివి ఎంచుకోవాలి. మీరు కోరుకున్న బెర్త్ అందుబాటులో లేకపోతే, ఆ షరతుల కారణంగా టికెట్ బుకింగ్ జరగకపోవచ్చు. కాబట్టి టికెట్ బుక్ చేసే ముందు ఈ సెట్టింగ్స్‌ను ఒకసారి చూడడం మంచిది.
లోయర్ బెర్త్ కోటాకు అర్హులా ?
భారతీయ రైల్వే కొన్ని వర్గాల ప్రయాణికులకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ముఖ్యంగా ఈ కేటగిరీల వారికి నిబంధనల ప్రకారం లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది.
సీనియర్ సిటిజన్లు.
45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు, గర్భిణీ స్త్రీలు. వీరికి అందుబాటులో ఉన్న బెర్త్‌లను బట్టి లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం కొన్ని కోచ్‌లలో ప్రత్యేకంగా లోయర్ బెర్త్‌లను కూడా కేటాయిస్తారు.
స్లీపర్ క్లాస్‌లో ఒక్కో కోచ్‌కు సుమారు 6 నుంచి 7 లోయర్ బెర్త్‌లు.
AC 3 టైర్లో ఒక్కో కోచ్‌కు సుమారు 4 నుంచి 5 లోయర్ బెర్త్‌లు.
AC 2 టైర్లో ఒక్కో కోచ్‌కు సుమారు 3 నుంచి 4 లోయర్ బెర్త్‌లు.
ఈ బెర్త్‌లు అర్హులైన ప్రయాణికులను బట్టి కేటాయిస్తారు. కాబట్టి మీకు లేదా మీతో ప్రయాణించే వారికి అర్హత ఉంటే, టికెట్ బుక్ చేసేటప్పుడు సంబంధిత వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
ప్రయాణికుల వివరాలను తప్పుగా ఎంటర్ చేయకండి
టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల పేరు, వయస్సు, లింగం వంటి వివరాలను సరిగ్గా ఎంటర్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధుల కోసం టికెట్ బుక్ చేసేటప్పుడు వారి వయస్సును సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మహిళా ప్రయాణికులు, గర్భిణుల విషయంలోనూ సరైన వివరాలు ఇవ్వాలి. కొన్నిసార్లు ముందే సేవ్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను ఉపయోగిస్తుంటారు. అప్పుడు వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోవాలి. గ్రూప్‌గా ప్రయాణించేవారిలో అందరికీ లోయర్ బెర్త్ కావాలని అప్షన్ చేసినా, అందరికీ కింది బెర్త్‌లు వస్తాయని మాత్రం హామీ లేదు. బెర్త్‌ల లభ్యతను బట్టి కేటాయింపు ఉంటుంది.
టికెట్ బుక్ చేసుకునే ముందు
పైన చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లోయర్ బెర్త్ కచ్చితంగా వస్తుందని చెప్పలేం. ఎందుకంటే రైలులో బెర్త్‌ల లభ్యత, ప్రయాణించే క్లాస్, కోటా, రైల్వే నిబంధనల ఆధారంగా కేటాయింపు జరుగుతుంది.
ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులతో ప్రయాణించేవారు వీలైనంత ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఒక రైలులో లోయర్ బెర్త్‌లు అందుబాటులో లేకపోతే, వేరే రైళ్లలో కూడా ప్రయత్నించవచ్చు. ప్రయాణ సమయంలో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే, అవసరమైన సందర్భాల్లో టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి బెర్త్ మార్పు గురించి అడగవచ్చు. అయితే బెర్త్ మార్పు అనేది అందుబాటును బట్టి, రైల్వే నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
చివరిగా ఒక విషయం..టికెట్ కన్ఫర్మ్ అయిందంటే మీకు లోయర్ బెర్త్ వచ్చినట్లు కాదు. కాబట్టి టికెట్ బుక్ చేసిన తర్వాత మీ PNR స్టేటస్‌ను చెక్ చేసుకోండి. అందులో మీకు ఏ బెర్త్ కేటాయించారో నిర్ధారించుకోండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.
