పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. అర్హులైన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసిన వారికి నెలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి 'భరోసా' అని పేరు పెట్టారు. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థలు, ఐటీఐల నుంచి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి రూ.2వేలు అందుతాయి. ఇతర సాంకేతిక శిక్షణ పొందిన వారికి నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పారు.
ఈ సాయం పొందేందుకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 15 నెలల పాటు ప్రతి నెల ఈ డబ్బులు చెల్లిస్తారు. తొలి విడత సాయం ఫిబ్రవరి 1న అందుతుందని సువేందు అధికారి తెలిపారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 15 నెలల్లో మొత్తం రూ.30 వేలు, ఇతరులకు రూ.22వేల 500 అందుతాయని అధికారులు చెప్పారు.
ఉద్యోగ ఖాళీలు, ఫీజుల రద్దు..
నిరుద్యోగ భృతితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తు ఫీజులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న 10వేల146 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పాలనాపరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ నిధులను సమకూరుస్తున్నట్లు సీఎం చెప్పారు. అధికారిక సమావేశాల సమయాన్ని, ఖర్చును ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు సీఎం. దీనివల్ల మిగిలిన నిధులను యువత సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు. భరోసా స్కీమ్ పూర్తి నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
