వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తుంది. అదే డ్యూయల్ కెమెరా మోడ్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఒకేసారి ఫోన్ ముందు కెమెరా, వెనుక కెమెరాలను ఉపయోగించి వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా వీడియో తీస్తూనే, దానిపై మీ రియాక్షన్‌ను కూడా రికార్డ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెస్తూ... వాట్సాప్ వెర్షన్ 2.26.46.9లో ఈ కొత్త ఆప్షన్ కనిపిస్తున్నట్లు తెలిపింది.
డ్యూయల్ కెమెరా మోడ్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ద్వారా ఫోన్లోని రెండు కెమెరాలు ఒకేసారి పనిచేస్తాయి. వెనుక కెమెరా ద్వారా మీ చుట్టూ ఉన్న దృశ్యాలను రికార్డ్ చేయవచ్చు. అదే సమయంలో ముందు కెమెరా ద్వారా మీ ముఖాన్ని కూడా వీడియోలో చూపించవచ్చు.
ఉదాహరణకు మీరు ఏదైనా మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారనుకోండి. వెనుక కెమెరాతో స్టేజ్‌పై జరిగే షోని రికార్డ్ చేస్తూనే, ముందు కెమెరాతో మీ ఆనందాన్ని, మీ రియాక్షన్‌ను కూడా రికార్డ్ చెయ్యవచ్చు. ముందు కెమెరా వీడియో స్క్రీన్‌పై ఒక చిన్న విండోలో కనిపిస్తుంది. ఈ విండోను మీకు నచ్చిన చోటికి మార్చుకోవచ్చు. దీనివల్ల ప్రైమరీ వీడియోలోని దృశ్యాలు కనిపించకుండా ఇబ్బంది ఉండదు.
అంతేకాదు, రెండు కెమెరాల మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రొటేట్ బటన్ నొక్కితే ముందు కెమెరా ప్రైమరీ స్క్రీన్‌పైకి వస్తుంది. వెనుక కెమెరా చిన్న విండోలో కనిపిస్తుంది.
తీసిన ఫొటోలు, వీడియోలను ఎక్కడ షేర్ చేయొచ్చు?
డ్యూయల్ కెమెరాతో తీసిన ఫొటోలు, వీడియోలను డైరెక్ట్ వాట్సాప్‌లోనే షేర్ చేసుకోవచ్చు. ఇంకా పర్సనల్ చాట్స్‌లో పంపించవచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చు. ఛానెల్స్‌లో పోస్ట్ చేయవచ్చు అలాగే స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. వీడియో లేదా ఫొటో షేర్ చేసే ముందు క్యాప్షన్లు కూడా పెట్టొచ్చు. అవసరమైతే అందుబాటులో ఉన్న ఎడిటింగ్ ఆప్షన్లతో మార్పులు చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది?
ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా వీడియోలు తీసేవారికి బాగా ఉపయోగపడుతుంది. వ్లాగర్లు అయితే ప్రయాణంలో కనిపించే ప్రదేశాలతో పాటు వారి అనుభవాలను కూడా రికార్డ్ చేయవచ్చు. కంటెంట్ క్రియేటర్లు అయితే రియాక్షన్ వీడియోల కోసం ప్రత్యేకంగా మరో వీడియో తీయాల్సిన అవసరం ఉండదు. ప్రయాణ ప్రియులు అయితే అందమైన ప్రదేశాలను చూపిస్తూనే వారి ఆనందాన్ని కూడా వీడియోలో రికార్డ్ చేయవచ్చు. ఇక సాధారణ యూజర్లు పుట్టినరోజులు, ఈవెంట్స్, ఫంక్షన్లు వంటి సందర్భాల్లో వారి రియాక్షన్లను కూడా రికార్డ్ చేసుకోవచ్చు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సెలెక్ట్ చేసిన కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందిస్తున్నారు. దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే తాజా బీటా వెర్షన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ వెంటనే ఈ ఆప్షన్ కనిపించకపోవచ్చు.
వాట్సాప్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి విడుదల తేదీని ప్రకటించలేదు. ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందనే విషయంపై కూడా స్పష్టత లేదు.
మొత్తానికి.. ఈ డ్యూయల్ కెమెరా ఫీచర్ అందుబాటులోకి వస్తే వీడియోలు తీసే విధానం మరింత ఈజీ కానుంది. ఒకవైపు మనం చూస్తున్న దృశ్యాలను, మరోవైపు మన రియాక్షన్స్ ఒకే వీడియోలో రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్లు, ట్రావెల్ వీడియోలు పెట్టుకునేవారికి ఇదొక మంచి ఫీచర్ కానుంది.
