శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ముందు భాగంలో ఘనంగా జ్వాలాతోరణ మహోత్సవం జరిగింది. శివా నామస్మరణతో శ్రీశైలం క్షేత్రం మారుమోగింది. జ్వాలాతోరణం భస్మాన్ని నుదుటిపై పూసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
జ్వాలాతోరణ కార్యక్రమానికి మల్లన్న భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జ్వాలాతోరణంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తీక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తీక దీపారాధనలతో వెలిగిపోయింది. కార్తీక మాసంలో వచ్చిన సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
