గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని రాస్ అల్ ఖైమాలో 2026 నవంబర్ 24న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొట్టుకున్న ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మృతుల్లో భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తెలిపింది.
అల్ వతన్ రోడ్డుపై ఒక ప్రయాణికుల బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రమాదంలో తొలుత 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరినట్లు స్థానిక మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారు.
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు
మెకానికల్ లోపం వల్ల రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ట్రక్కును బస్సు ఢీకొట్టినటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఖలీజ్ టైమ్స్ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారనే పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నామని, స్థానిక అధికారుల సహాయంతో బాధితులకు అండగా ఉంటామని తెలిపింది. సమాచారం కోసం 800-46342 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఎక్స్ వేదికగా ప్రకటించింది.
గత వారం కూడా ప్రమాదం
నవంబర్ 13న యూఏఈలోని ఫుజైరాలో జరిగిన మరో ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నారు. ప్రమాదంలోనూ భారతీయ పౌరుల వివరాలను తెలుసుకునేందుకు కాన్సులేట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
