Mahesh Babu: యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి 'వారణాసి' సెట్స్ లీక్? వైరల్ అవుతున్న షాకింగ్ విజువల్స్!

Mahesh Babu: యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి 'వారణాసి' సెట్స్ లీక్? వైరల్ అవుతున్న షాకింగ్ విజువల్స్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్‌ చిత్రం ' వారణాసి '. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి సినిమా భారీ సెట్స్ కనిపించాయంటూ నెటిజన్లు షేర్ చేస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

యాపిల్ మ్యాప్స్‌లో సెట్టింగ్స్..

నవంబర్ 18, 2026న యాపిల్ మ్యాప్స్‌లో భారత్‌కు సంబంధించిన హైరిజల్యూషన్ మ్యాపింగ్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని కోకాపేట పరిసరాల్లో ఉన్న ఓ భారీ నిర్మాణాన్ని కొందరు నెటిజన్లు గుర్తించారు. ఈ ఏరియల్ విజువల్స్‌లో పురాతన భారతీయ దేవాలయాలు, ఎత్తైన శిఖరాలు, రాతి ఘాట్‌లు, విశాలమైన ప్రాంగణాలు, నీటి కొలనులు, పడవల నమూనాలు కనిపిస్తున్నాయి. ఇవి 'వారణాసి' సినిమా కోసం నిర్మించిన కాశీ సెట్ అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విజువల్స్ సినిమా సెట్స్‌వే అని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.

 

గతంలోనూ లీకులు...

2025లో సినిమా టైటిల్ లాంచ్ సందర్భంగా డ్రోన్ ద్వారా మహేశ్ బాబు లుక్స్ బయటకు రావడంపై రాజమౌళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఎంతో కష్టపడి దాచిన సర్‌ప్రైజ్ ఒక్క డ్రోన్ కారణంగా బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిణామం చర్చనీయాంశంగా మారింది. 

షూటింగ్ పూర్తి..

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఎంఎం కీరవాణి రీ-రికార్డింగ్, డబ్బింగ్, భారీ VFX పనులు జరుగుతున్నాయి. వారణాసి, ఆఫ్రికా, అంటార్కిటికా, ప్రాచీన రోమ్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండనుంది. మహేశ్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు.

IMAX 1.43:1 ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. మరి యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన విజువల్స్ నిజంగానే రాజమౌళి సృష్టించిన కాశీ ప్రపంచానివేనా? అసలు సినిమాలో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..