హైదరాబాద్: ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ చెరువు ప్రారంభం కానుంది. డిసెంబర్లో చెరువును ప్రారంభించేందుకు హైడ్రా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్రమణల తొలగింపుతో 67.31 ఎకరాలకు ఈ చెరువు విస్తరించింది. గతంలో 52.30 ఎకరాలకే పరిమితమైన నల్లచెరువు, చెరువు చుట్టూ 2.4 కిలోమీటర్ల బండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం గజీబోలు, సీటింగ్ ఏరియాల ఏర్పాటు చేశారు.
పిల్లలు, పెద్దలు సేదతీరేలా వినోద సదుపాయాలను అభివృద్ధి చేశారు. చెరువులోకి వరద నీరు చేరేందుకు రెండు ఇన్లెట్లు ఏర్పాటు, ఔట్ ఫ్లో నీటిని మూసీలోకి మళ్లించేలా అవుట్లెట్ అభివృద్ధి చేయడం గమనార్హం. గతంలో వ్యర్థాలతో నిండిన నల్లచెరువు హైడ్రా పునరుద్ధరణతో పర్యాటక కేంద్రంగా మారనుంది. మొదటి దశలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల్లో ఉప్పల్ నల్లచెరువు కీలక ప్రాజెక్టుగా ఉంది.
మురుగు నీళ్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమై కంపుతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురిచేసిన ఉప్పల్ నల్ల చెరువు రూపురేఖలు మార్చుకుంటోంది. నేషనల్ హైవే పక్కనున్న నల్ల చెరువును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రూ. 20 కోట్ల హెచ్ఎండీఏ ఫండ్స్‌తో హైడ్రా ముందడుగేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లోని పలు చెరువులకు ప్రాణం పోస్తున్న హైడ్రా 64 ఎకరాల్లో ఉప్పల్ నల్ల చెరువు బ్యూటిఫికేషన్‌ను కూడా భుజానవేసుకుంది. గత ఏడాది పనులు మొదలు పెట్టి ముందుగా గుర్రపు డెక్క పూర్తిగా తొలగించింది. మురుగు నీటిని తోడేసి పూడికతీసింది. చెరువులోకి నాచారం పెద్ద చెరువు నుంచి వచ్చే మురుగు నీటిని ఇప్పటికే డైవర్ట్ చేసి ఎస్టీపీలోకి మళ్లించింది. చుట్టూ వాకింగ్ ట్రాక్, వాటర్ ఫౌంటెయిన్లు, పార్కులు, పిల్లల ఆటస్థలాల పనులు పూర్తయ్యాయి.
