తెలంగాణలో సగం మంది మహిళలకు రక్తం తక్కువే!

తెలంగాణలో సగం మంది మహిళలకు రక్తం తక్కువే!

 

  • 54% మహిళలు, 47.4% ఐదేండ్ల వరకు చిన్నారుల్లో రక్తహీనత 
  •     ఈ విషయంలో పురుషులు, వృద్ధులు బెటర్​
  •     దేశవ్యాప్తంగా గత సర్వేల కంటే తగ్గిన రక్తహీనత అంచనాలు
  •     విటమిన్ బీ12 లోపం తీవ్రం..
  •     ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సంపద సర్వేలో వెల్లడి
  •     సరైన చికిత్సతో కట్టడి చేసే చాన్స్


 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని15 నుంచి 49 ఏండ్ల మహిళల్లో 54 శాతం మందికి రక్తహీనత (అనీమియా) ఉన్నట్లు హైదరాబాద్‌‌‌‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్) నిర్వహించిన సంపద – 2023–25 జాతీయ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1–5 ఏళ్ల చిన్నారుల్లో (12–59 నెలలు) 47.4 శాతం మందికి రక్తహీనత ఉండగా, ఇది జాతీయ సగటు (41.8%) కంటే ఎక్కువగా ఉంది. అయితే స్కూలు పిల్లలు (5–9 ఏళ్లు–23.8%), కౌమార బాలికలు (43.6%), బాలురు (16.4%), వృద్ధ మహిళలు (44.8%), వృద్ధ పురుషులు (28.6%) తదితర విభాగాల్లో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పురుషుల్లో కేవలం 12.5 శాతం మందికే రక్తహీనత ఉంది (జాతీయ సగటు 22%). దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల్లో 81 వేలకు పైగా కుటుంబాల నుంచి 2 లక్షల మందికి పైగా ప్రజలను సర్వే చేసి, 1.7 లక్షలకు పైగా రక్త నమూనాలను పరీక్షించి ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ ఈ ఫ్యాక్ట్ షీట్స్ విడుదల చేసింది.

మెజారిటీ కేసులన్నీ ప్రారంభ దశలోనే..

గతంలో జరిగిన జాతీయ సర్వేలతో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా రక్తహీనత అంచనాలు తక్కువగా నమోదయ్యాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. దేశంలో అన్ని గ్రూపుల కంటే బాలింతల్లోనే రక్తహీనత అత్యధికంగా (పట్టణాల్లో 58.1%, గ్రామీణంలో 60.5%) ఉండగా.. మహిళలు, వృద్ధ మహిళల్లో సుమారు 55–56 శాతం, కౌమార బాలికల్లో 46.3 శాతం, గర్భిణుల్లో 43.6 శాతం, వృద్ధ పురుషుల్లో 44.7 శాతం, 5–9 ఏళ్ల పిల్లల్లో 31.3 శాతం, కౌమార బాలురులో 22.8 శాతం ఉంది. నమోదైన రక్తహీనత కేసుల్లో అత్యధికం స్వల్ప (మైల్డ్) స్థాయిలోనే ఉండటం ఇందులో సానుకూల అంశం. పిల్లలు, బాలికలు, గర్భిణులు, బాలింతలు, మహిళల్లోని అనీమియా కేసుల్లో దాదాపు సగం.. బాలురు, పురుషులు, వృద్ధుల కేసుల్లో దాదాపు మూడు వంతులు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయి. తీవ్రమైన రక్తహీనత చాలా వరకు వయసు గ్రూపుల్లో 2 శాతం కంటే తక్కువే. అంటే సమస్య ముదరకముందే ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన ఆహారం, చికిత్స అందించేందుకు మంచి అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

దేశంలో సగానికి పైగా విటమిన్ బి12 లోపమే

సూక్ష్మపోషకాల కొరతను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా విటమిన్ బి12 లోపం అందరిలోనూ అత్యధికంగా ఉంది. చిన్నారుల్లో 37 శాతం నుంచి కౌమార బాలబాలికల్లో 66 శాతం వరకు, పురుషులు, మహిళలు, గర్భిణుల్లో 55 నుంచి 63 శాతం వరకు విటమిన్ బి12 లోపం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషుల్లోనైతే ఇది ఏకంగా 69 శాతంగా ఉంది. రక్తహీనత ఉన్నవారిలోనూ, లేనివారిలోనూ విటమిన్ బి12, ఫోలేట్ లోపాలు దాదాపు సమానంగా ఉన్నాయి. అయితే ఫోలేట్ లోపం దేశవ్యాప్తంగా తక్కువగానే (3 నుంచి 10 శాతం మధ్య) ఉంది. ఇక ఐరన్ లోపం మాత్రం ప్రధానంగా 1–5 ఏళ్ల పిల్లలు (23%), కౌమార బాలికలు (36%), మహిళల్లోనే (సుమారు 30–34%) కేంద్రీకృతమై ఉంది. పురుషులు (3.4%), వృద్ధుల్లో (5–9%) ఐరన్ లోపం చాలా తక్కువ. అందుకే ఐరన్ సంబంధిత పథకాలు, చికిత్సల్లో చిన్న పిల్లలు, బాలికలు, మహిళలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సర్వే సూచించింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో రక్తహీనత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.  కేరళం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది.

కచ్చితమైన లెక్కల కోసం గోల్డ్ స్టాండర్డ్ పరీక్షలు

గత జాతీయ సర్వేల్లో వేలికి సూది గుచ్చి చేసే పాయింట్-ఆఫ్-కేర్ పరికరాలను వాడగా, ‘సంపద’ సర్వేలో మొదటిసారి అత్యంత కచ్చితమైన గోల్డ్ స్టాండర్డ్ వీనస్ బ్లడ్ శాంప్లింగ్ (సిరల నుంచి రక్త సేకరణ) పద్ధతిని ఉపయోగించారు. సేకరించిన రక్తాన్ని 4–6 గంటల్లోనే ఫీల్డ్ ల్యాబ్‌‌‌‌లలోని ఆటోమేటెడ్ అనలైజర్లలో పరీక్షించి, మిగిలిన నమూనాలను హైదరాబాద్‌‌‌‌లోని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ కేంద్ర ల్యాబ్‌‌‌‌లో -80 C వద్ద భద్రపరిచారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ -2024 కొత్త ప్రమాణాలను అనుసరించడంతో పాటు, శరీరంలో వాపు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఐరన్ లెక్కలు తప్పు రాకుండా ప్రత్యేక శాస్త్రీయ పద్ధతిలో (బీఆర్ఐఎన్డీఏ) సర్దుబాటు చేసి ఫలితాలను లెక్కించారు. రక్తహీనతను నిర్మూలించి  లక్షిత పోషకాహార, ప్రజారోగ్య వ్యూహాలు రూపొందించడానికి ఈ కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వానికి ఎంతో దోహదపడనున్నాయని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ తెలిపింది 

ఐరన్ లోపం ఒక్కటే కారణం కాదు...

రక్తహీనత అనగానే కేవలం ఐరన్ లోపం వల్లే వస్తుందనే అభిప్రాయం సాధారణంగా ఉంటుంది. కానీ అనీమియాకు ఐరన్ లోపం ఒక్కటే కారణం కాదని ‘సంపద’ సర్వే తేల్చింది. ఉదాహరణకు దేశంలో మొత్తం కౌమార బాలికలు, మహిళల్లో 46 నుంచి 56 శాతం వరకు రక్తహీనత ఉండగా, ఐరన్ లోపంతో కూడిన అనీమియా 27 శాతం మందిలోనే (అంటే బాధితుల్లో సుమారు సగం మందిలో మాత్రమే) ఉంది. మిగతా కేసులకు ఇతర పోషక లోపాలు, పోషకేతర కారణాలు దారితీస్తున్నాయి. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారిలో ఐరన్ లోపం ప్రధాన కారణంగా కనిపిస్తున్నా, స్వల్ప స్థాయి అనీమియా ఉన్నవారిలో ఇతర కారణాలు ఉంటున్నాయి. అలాగే మహిళల్లో జీవితాంతం రక్తహీనత ఎక్కువగా ఉండి, ఐరన్ లోపం మాత్రం 20–35 ఏళ్ల మధ్య పెరిగి 50 ఏళ్ల తర్వాత తగ్గుతోంది. పురుషుల్లో వృద్ధాప్యంలోకి వచ్చేసరికి రక్తహీనత పెరుగుతోంది. కాబట్టి కేవలం ఐరన్ మాత్రలపైనే ఆధారపడకుండా ఇతర కారణాలను గుర్తించి అనీమియాకు చికిత్స చేయాలని నివేదిక పేర్కొంది.