- సింగూరులో గతేడాది 16.38 టీఎంసీలు.. ఇప్పుడు 2 టీఎంసీలే
- మంజీరాలో మిగిలింది 0.22 టీఎంసీలే
- ఉస్మాన్‌సాగర్‌లో సగానికి పడిపోయిన నిల్వ
- హిమాయత్‌సాగర్‌లో 32 శాతం తగ్గుదల
- కృష్ణా, గోదావరి నీళ్లే భాగ్యనగరానికి దిక్కు
- రోజుకు 2,628 మిలియన్ లీటర్ల సరఫరా
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారమైన జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా సింగూరు జలాశయంలో నిల్వలు భారీగా పడిపోయాయి. గతేడాది నవంబర్ 21 నాటికి సింగూరులో 16.379 టీఎంసీల నీళ్లు ఉండగా, ఈ ఏడాది అదే తేదీకి 1.997 టీఎంసీలకే పరిమితమయ్యాయి. మంజీరాలోనూ నిల్వలు అడుగంటడంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నీటిని ఎక్కువగా తోడాల్సి వస్తోంది. అయితే కొత్తగా ఇన్‌ఫ్లో లేకపోవడంతో జంట జలాశయాల్లోనూ నిల్వలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం సిటీకి కృష్ణా, గోదావరి నీళ్లే ప్రధాన ఆధారంగా మారాయి.
గతేడాది నవంబర్ 21 నాటికి సింగూరులో 1,707.580 అడుగుల నీటిమట్టం వద్ద 16.379 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది నీటిమట్టం 1,682.398 అడుగులకు పడిపోయి 1.997 టీఎంసీలే ఉన్నాయి. అంటే దాదాపు 88 శాతం నిల్వలు తగ్గాయి. ఇక్కడి నుంచి రోజుకు 316 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల నీళ్లు సిటీకి సరఫరా చేస్తున్నారు. మంజీరా జలాశయంలో గతేడాది ఇదే సమయానికి 1,651.400 అడుగుల వద్ద 1.441 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 1,642.700 అడుగుల వద్ద 0.220 టీఎంసీలే ఉన్నాయి; అంటే దాదాపు 85 శాతం తగ్గాయి. ఇక్కడి నుంచి రోజుకు 178.510 ఎంఎల్డీలు తరలిస్తున్నారు.
జంట జలాశయాలపై భారం
ఉస్మాన్‌సాగర్‌లో గతేడాది పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగుల వద్ద 3.900 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు నీటిమట్టం 1,781.300 అడుగులకు పడిపోయి 1.940 టీఎంసీలే ఉన్నాయి. అంటే గతేడాది కంటే సగానికి పైగా నిల్వ తగ్గింది. ఇక్కడి నుంచి రోజుకు 109.467 ఎంఎల్డీలు వాడుతున్నారు. హిమాయత్‌సాగర్‌లో గతేడాది పూర్తిస్థాయి మట్టం 1,763.500 అడుగుల వద్ద 2.968 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 1,759.950 అడుగుల వద్ద 2.017 టీఎంసీలకు తగ్గాయి. అంటే దాదాపు
32 శాతం తగ్గుదల. ఇన్‌ఫ్లో లేకపోయినా ఇక్కడి నుంచి రోజుకు 54.097 ఎంఎల్డీలు సిటీకి తరలిస్తున్నారు.
కృష్ణా, గోదావరి నీళ్లే దిక్కు
కృష్ణా నీళ్లు చేరే అక్కంపల్లి, గోదావరిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాల్లో మాత్రం నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. నదుల నుంచి నీళ్లు అందుతుండటంతో వీటికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అక్కంపల్లిలో 1.371 టీఎంసీలు ఉండగా, 0.077 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇక్కడి నుంచి రోజుకు 1,236.120 ఎంఎల్డీలు సిటీకి సరఫరా చేస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.144 టీఎంసీలు ఉన్నాయి. 0.024 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తుండగా, రోజుకు 734.133 ఎంఎల్డీలు తరలిస్తున్నారు. సిటీకి రోజూ సరఫరా అవుతున్న నీటిలో మూడొంతులు (దాదాపు 75 శాతం) ఈ రెండింటి నుంచే వస్తోంది.
ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి
ప్రస్తుతం ఆరు జలాశయాల నుంచి రోజుకు దాదాపు 2,628.327 మిలియన్ లీటర్ల నీళ్లను సిటీకి తరలిస్తున్నారు. కృష్ణా, గోదావరి మినహా మిగతా ఎక్కడా ఇన్‌ఫ్లో లేదు. సింగూరు, మంజీరాలో నీళ్లు అడుగంటుతున్న నేపథ్యంలో జలమండలి ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టింది. జంట జలాశయాల్లోనూ నిల్వలు తగ్గుతుండటంతో, ఎండాకాలం దాకా సిటీకి నిరంతరాయంగా నీళ్లు అందించేందుకు జలమండలి నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
