మదురై: తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై మంగళవారం (నవంబర్ 24) కార్తీక మహాదీపాన్ని వెలిగించారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం దర్గా పక్కన ఉన్న రాతి స్తంభంపై కాకుండా, సంప్రదాయబద్ధంగా ఉచ్చి పిళ్లైయార్ ఆలయం దగ్గరే దీపాన్ని వెలిగించడంతో వివాదం మరింత ముదిరింది. కొండపై ఉన్న రాతి స్తంభం దగ్గర ఈసారికి దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు నవంబర్ 20న అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు అనుమతించినప్పటికీ విజయ్ ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు.
శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో జిల్లా యంత్రాంగం తిరుప్పరంకుండ్రంలో నిషేధాజ్ఞలు విధించింది. రెండు వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్ ఎక్స్‌లో స్పందిస్తూ.. దీపాన్ని వెలిగించినట్లు ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు అనుమతించిన ప్రదేశంలో ఎందుకు వెలిగించలేదనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నేతలు ఎల్. మురుగన్, నైనార్ నాగేంద్రన్ తిరుప్పరంకుండ్రం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సంప్రదాయాలు, ఆగమ నియమాల ప్రకారమే ఉచ్చి పిళ్లైయార్ ఆలయం దగ్గర ఉన్న దీప మండపంలో దీపాన్ని వెలిగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాలను కాపాడాలని స్పష్టం చేశారు. మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. దీపం పండుగను రాజకీయం చేయాలనుకున్న వారికి నిరాశే ఎదురైందని విమర్శించారు. బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించిన న్యాయశాఖ మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని ఆరోపించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను, చట్టాలను గౌరవించడం లేదని చెప్పారు.
కొండపై ఉన్న రాతి స్తంభం దీపాలు వెలిగించే స్తంభమని పిటిషనర్లు వాదిస్తున్నారు. గతంలో 1862, 1912లో అక్కడ దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. 1996లో మద్రాసు హైకోర్టు దీపం వెలిగించేందుకు దర్గాకు కనీసం 15 మీటర్ల దూరంలో ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూడాలని సూచించింది. గతేడాది డిసెంబర్ 1న మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ కొండపై ఉన్న రాతి స్తంభం దగ్గర దీపం వెలిగించాలని ఆదేశించింది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మిత్రపక్షాల నుంచి ఈ అంశంలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కొండపై దీపం వెలిగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మత సామరస్యానికి విఘాతం కలిగిస్తుందని ఆ పార్టీలు వాదిస్తున్నాయి.
