ఇంటర్ విలీనంపై ఏకపక్ష నిర్ణయాలొద్దు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

ఇంటర్ విలీనంపై ఏకపక్ష నిర్ణయాలొద్దు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, 2030 నాటికి ఇంటర్ విద్యను దశలవారీగా పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లొద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విద్యారంగంలో ఇలాంటి కీలక మార్పులు చేపట్టే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఈ మేరకు మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020)లో భాగంగా డ్రాపౌట్ల నివారణ పేరుతో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించినంత మాత్రాన నాణ్యమైన విద్య అందదని జాన్ వెస్లీ పేర్కొన్నారు. డ్రాపౌట్లకు ప్రధాన కారణమవుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. 

కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలి..

బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్, కేవలం 8.23 శాతమే కేటాయించిందని జాన్ వెస్లీ విమర్శించారు. విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించడంతో పాటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని కోరారు.