- సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని వెల్లడి
- పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 నాలెడ్జ్ డే కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: పౌల్ట్రీ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని నోవాటెల్, హెచ్ఐసీసీలో నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 నాలెడ్జ్ డే కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశవిదేశాల నుంచి హాజరైన పౌల్ట్రీ రంగ పారిశ్రామికవేత్తలు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో యుద్ధప్రాతిపదికన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను త్వరలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు పరిశ్రమలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మహిళలకు ఈ రంగంలో విస్తృత అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, పౌల్ట్రీ రంగ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పౌల్ట్రీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు, ఐపీఈఎంఏ ప్రతినిధి ఉదయ్ సింగ్ పాల్గొన్నారు.
