ఇందిరమ్మ బీమాతో  పేదలకు ధీమా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వర్తింపజేస్తం : మంత్రి వివేక్

ఇందిరమ్మ బీమాతో  పేదలకు ధీమా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వర్తింపజేస్తం : మంత్రి వివేక్
  •   కొత్తగా 5 లక్షల మందికి  పెన్షన్లు మంజూరు చేశాం
  •     చెన్నూరు మండలం గంగారంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం 

 

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సర్కార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో  కలెక్టర్​ కుమార్​ దీపక్​తో కలిసి పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం  దేశంలో ఎక్కడాలేని అనేక  సంక్షేమ పథకాలను అముల చేస్తోందని చెప్పారు. ఇంటిపెద్దను  కోల్పోయిన కుటుంబాలకు ఈ బీమా పథకం అండగా ఉంటుందన్నారు. గతంలో 40 లక్షల మందికే​ రైతు బీమా ఉండగా.. ఇప్పుడు కోటిమందికి   ఇందిరమ్మ బీమా వర్తింపచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేశామని, 5 లక్షల మంది వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు  పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 20 లక్షల మంది విద్యార్థులకు  బ్రేక్​ఫాస్ట్​అందిస్తున్నామన్నారు. మహిళ ఫ్రీ బస్సు కోసం రూ.9వేల కోట్లు, సన్నబియ్యం పంపిణీకి రూ.13 వేల కోట్లు  ఖర్చు చేస్తున్నట్టు  వెల్లడించారు.

చెన్నూరుకు బస్ డిపో.. 100 పడకల దవాఖాన

చెన్నూరులో ఆర్టీసీ బస్​డిపో, 100 పడకల ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వివేక్​ వెంకటస్వామి చెప్పారు. హాస్పిటల్​కు ఇప్పటికే 20  డాక్టర్​ పోస్టులు మంజూరు చేసినట్టు తెలిపారు. గంగారంలో  450 కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా కల్పిస్తామన్నారు. గ్రామానికి మొదటి విడతలో 28 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, మరో 20 ఇండ్లను వెంటనే మంజూరు చేయిస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఇప్పటికే  రూ. 50 లక్షలకు పైగా నిధులు ఇచ్చామని,  వచ్చే ఏడాది మరో రూ.15 నుంచి 20 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

చెన్నూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా భారీగా నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల పనులకు రూ.70 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో  అందిస్తున్న అల్పాహారం బాగుందంటూ ఓ చిన్నారి  మంత్రికి చెప్పి సంతోషం వ్యక్తం చేశారు.  అనంతరం చెన్నూరులో పరమేశ్వర హోటల్​ను మంత్రి ప్రారంభించారు. అలాగే సోమనపల్లికి చెందిన కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ తుమ్మల మహేందర్​రెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమాల్లో  డీసీసీ ప్రెసిడెంట్​ పి.రఘునాథ్​రెడ్డి, గ్రామ సర్పంచ్ కుడుదుల మల్లక్క,  జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అజ్మత్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారి, ప్రజాప్రతినిధులు, లీడర్లు హాజరయ్యారు.