- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు
- విద్యాశాఖ కార్యదర్శికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకూ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, ఇతర టెర్మినల్ బెనిఫిట్స్ కల్పించే దిశగా అడుగు పడింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తింపజేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు.
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ ప్రయోజనాలు కల్పించాలని మోడల్ స్కూల్స్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నెల 17న ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది. 2017 నవంబర్ 27న జారీ చేసిన జీవో 32 ప్రకారం 2013–-14 విద్యా సంవత్సరం నుంచే మోడల్ స్కూల్ ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేస్తున్నారు.
అయితే, మోడల్ స్కూల్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు సీపీఎస్ పరిధిలోకి వస్తారని పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 12న మెమో జారీ చేసింది. జీవో 32 నిబంధనల ప్రకారం ప్రతిపాదనలను మరోసారి పరిశీలించి, సవరించిన సిఫార్సులు పంపాలని విద్యాశాఖను ఆదేశించింది. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. మోడల్ స్కూల్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా, జీవో 32 ద్వారా ప్రభుత్వమే వారిని సీపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చిందని వివరించారు. స్కూళ్ల ప్రారంభం నుంచి వాటి లక్ష్యాల సాధనలో ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
మూడు జీవోలను పరిగణనలోకి తీసుకోవాలి..
సీపీఎస్/ఎన్పీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీ వర్తింపజేస్తూ 2018 మే 23న జారీ చేసిన జీవో 60, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇన్వాలిడేషన్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ పునరుద్ధరిస్తూ 2021 జూన్ 11న ఇచ్చిన జీవో 58తో పాటు జీవో 32ను పరిగణనలోకి తీసుకోవాలని డైరెక్టర్ సూచించారు. ఈ జీవోల ఆధారంగా మోడల్ స్కూల్ ఉద్యోగులకూ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, ఇతర టెర్మినల్ బెనిఫిట్స్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
