- చిన్నారుల భవిష్యత్ తల్లిదండ్రుల బాధ్యత అని వెల్లడి
- పేరెంట్స్ మధ్య విభేదాలు, విడాకులు పిల్లల బాల్యంపై ప్రభావం చూపొద్దన్న ధర్మాసనం
హైదరాబాద్, వెలుగు: భార్యాభర్తల మధ్య విభేదాలు, విడాకుల వ్యవహారాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దంపతుల మధ్య వైవాహిక బంధం కొనసాగినా, విడిపోయినా పిల్లల సంరక్షణ బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండొద్దని పేర్కొంది. ప్రతి చిన్నారికి ప్రేమానురాగాలు, రక్షణతో కూడిన సంతోషకరమైన బాల్యం పొందే హక్కు ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య చికిత్సతో పాటు స్థిరమైన కుటుంబ వాతావరణం, క్రమబద్ధమైన దినచర్య, భావోద్వేగపరమైన భరోసా అవసరమని పేర్కొంది. తల్లిదండ్రుల మధ్య నిరంతరం కొనసాగే గొడవలు, విభేదాలు ఇలాంటి పిల్లల్లో మానసిక అభద్రతకు దారితీసే అవకాశముందని హెచ్చరించింది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల పెంపకంలో తాతయ్యలు, బామ్మలు సహా ఇతర కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉండేదని, వారి అనుభవాలు, కుటుంబ అనుబంధాలు, నైతిక విలువలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేవని గుర్తుచేసింది. పట్టణీకరణ, ఉపాధి కోసం వలసలు, మారుతున్న జీవన విధానాల కారణంగా ప్రస్తుతం పిల్లల సంరక్షణ ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యతగా మారిందని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) 2021 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 127 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని, 2025లో వెలువడిన 66 అధ్యయనాల సమీక్షలో 3 నుంచి 18 ఏండ్ల పిల్లల్లో ఆటిజం ప్రాబల్యం 0.77 శాతంగా నమోదైందని, ఎనిమిదేండ్లలోపు చిన్నారుల్లో ప్రతి 31 మందిలో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు వెల్లడైందని తీర్పులో ప్రస్తావించింది.
కేసు నేపథ్యం...
విడాకుల కోసం భర్త యూఏఈ కోర్టులో దావా వేయగా, అక్కడి విచారణను నిలిపివేయాలని కోరుతూ భార్య హైదరాబాద్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై కింది కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని అమలు చేయకుండా భర్త యూఏఈలో కేసు విచారణను కొనసాగించడంతో, కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద ఆయనను సివిల్ నిర్బంధంలోకి తీసుకోవాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించింది. విదేశీ న్యాయస్థానాల్లో విచారణను నిలిపివేయాలని ఆదేశించే విషయంలో సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలను కింది కోర్టులు అనుసరించాలని స్పష్టం చేసింది. భారత న్యాయస్థానాలకు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ, దానిని అత్యంత అరుదైన సందర్భాల్లోనే వినియోగించాలని పేర్కొంది. భర్తను సివిల్ నిర్బంధంలోకి తీసుకోవాలంటూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విదేశీ కోర్టులో విచారణ నిలుపుదలకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తిరిగి పరిశీలించాలని కింది కోర్టుకు సూచించింది.
