- జ్వాలా తోరణం, గంగా హారతి, సామూహిక వ్రతాలతో ఆధ్యాత్మిక శోభ
వేములవాడ/బాసర/దండేపల్లి, వెలుగు : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
వేకువజాము నుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి రావిచెట్టు వద్ద అర్చకులు కన్నులపండువగా జ్వాలాతోరణం నిర్వహించగా, భీమేశ్వర సదన్ వద్ద భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు.
రాజన్న ఆలయంలో నిశిపూజ అనంతరం ఏకాంతంగా మహాపూజ జరిపారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ ఈఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, బీజేపీ రాష్ర్ట నాయకుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
బాసరలో..
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని, పల్లకీ సేవలో పాల్గొన్నారు.
అనంతరం రూ.324 కోట్ల ప్రభుత్వ నిధులతో పాటు దాత ఇచ్చిన రూ.31 కోట్ల విరాళంతో సాగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సాయంత్రం గోదావరి నదీ తీరాన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే, భైంసా ఎస్పీ, ఆలయ ఈవో అంజనీ దేవి పాల్గొని గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి మహా జాతర వైభవంగా సాగింది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదిలారు. ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో సంకటాల శ్రీనివాస్ ఏర్పాట్లను, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ బందోబస్తును పర్యవేక్షించారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేండ్ల పాటు పదవిలో ఉండే ఈ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు.
