ఉద్యోగ రంగంలో జెన్‌ జీ హవా.. 2030 నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరు యువతే!

ఉద్యోగ రంగంలో జెన్‌ జీ హవా.. 2030 నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరు యువతే!
  • పని ప్రదేశాల్లో ఇప్పటికే 28% కి చేరిన కొత్త తరం
  • అర్థం చేసుకోలేక తంటాలు పడుతున్న హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ రిపోర్ట్​లో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని ఆఫీసుల్లో, పని ప్రదేశాల్లో త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతున్నది. 2030 నాటికి మన దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో  దాదాపు సగం( 47 %) మంది 'జెన్-జీ (1997 – 2012 మధ్య జన్మించిన వారు)' యువతే ఉండనున్నారు. అంటే మనం చూసే వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒక జెన్-జీ ఉండబోతున్నారు. 'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా' అనే సంస్థ 'వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్ కల్చర్' అనే అంశంపై రీసెర్చ్ చేసింది. 

135 మందికి పైగా హెచ్ఆర్ నిపుణులపై సర్వే నిర్వహించి, ‘వాయిస్ ఆఫ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ 2026’ పేరిట రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం..  గడిచిన మూడేండ్లలోనే దేశంలో జెన్-జీ ఉద్యోగుల సంఖ్య 28 శాతానికి చేరుకుంది. ఇది 2030 నాటికి దాదాపు సగానికి (47%) చేరనుంది. అయితే, ఈ తరం ఉద్యోగుల ఆలోచనలను, వారిని పనిలో ప్రోత్సహించే అంశాలను అర్థం చేసుకోవడంలో కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. హెచ్ఆర్ నిపుణులపై నిర్వహించిన సర్వేలో కేవలం 30% మంది మాత్రమే వివిధ జనరేషన్ ఉద్యోగుల అవసరాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారని రిపోర్ట్ తేల్చింది.

జెన్-జీ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నరంటే..!

జెన్-జీ ఉద్యోగులు పని వేళల్లో ఫ్లెక్సిబిలిటీని ఎక్కువగా కోరుకుంటున్నారని 78 శాతం మంది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ నిపుణులు తెలిపారు. పనిలో వెసులుబాటు లేకపోవడం వల్లే 59 శాతం మంది యువత తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారని నివేదిక పేర్కొంది. మిలీనియల్స్ తరం ఉద్యోగులు స్థిరత్వాన్ని కోరుకుంటే.. జెన్-జీ మాత్రం పనిలో స్వేచ్ఛను కోరుకుంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి హైబ్రిడ్ విధానాల వల్ల ఆఫీసుల్లో సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని 66% మంది హెచ్ఆర్ నిపుణు లు అభిప్రాయపడ్డారు. 

యువ ఉద్యోగులు త్వరగా జాబ్స్ మానేయడానికి జీతమే ప్రధాన కారణం కాదని నివేదిక తేల్చింది. ఇంటర్వ్యూ టైంలో కంపెనీలు చెప్పిన మాటలకు, ఉద్యోగంలో చేరాక ఉండే వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడంతోనే జెన్-జీ ఉద్యోగులు మానేస్తున్నారని 68% మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపినట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. మేనేజర్లు లేదా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిగ్గా కలవలేకపోవడం వల్ల 64% మంది, జీతం సరిపోక 45% మంది జెన్-జీ తమ ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వీరికి ఏడాదికోసారి కాకుండా, ఎప్పటికప్పుడు తమ పనితీరుపై ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ కావాలని, ఆజ్ఞాపించే బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కంటే దారిచూపే మెంటార్లు కావాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ నిపుణులు తెలిపినట్లు నివేదిక వెల్లడించింది.

ఈ సమస్యను అధిగమించేందుకే కొన్ని కంపెనీలు జెన్-జీలు ఉద్యోగంలో  చేరిన 5వ రోజు, 5వ వారం, 5వ నెలలో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నాయి. కాబట్టి, కంపెనీలు పాత పద్ధతులను పక్కన పెట్టి, యువత ఆలోచనలకు తగ్గట్టుగా తమ పని విధానాలను మార్చుకోవాలని రిపోర్ట్ పేర్కొంది.