సర్కారు బడుల్లో ఇక ‘చెత్త నిర్వహణ’ పాఠాలు.. ఆరు నుంచి టెన్త్ స్టూడెంట్స్‌‌‌‌కు ప్రత్యేక బుక్‌‌‌‌లెట్లు..

సర్కారు బడుల్లో ఇక ‘చెత్త నిర్వహణ’ పాఠాలు.. ఆరు నుంచి టెన్త్ స్టూడెంట్స్‌‌‌‌కు ప్రత్యేక బుక్‌‌‌‌లెట్లు..
  • డిసెంబర్‌‌‌‌లో పంపిణీ
  • సుప్రీం ఆదేశాలతో సిలబస్‌‌‌‌లో మార్పులకు విద్యాశాఖ చర్యలు

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘ఎస్‌‌‌‌డబ్ల్యూఎం రూల్స్–2026’ను పాఠశాల సిలబస్‌‌‌‌లో చేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు చెత్త నిర్వహణపై (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్) ప్రత్యేక పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే 3 నుంచి 10వ తరగతి వరకు సైన్స్, పర్యావరణ సబ్జెక్టుల్లో ప్లాస్టిక్ పునర్వినియోగం, 4ఆర్‌‌‌‌లు, కాలుష్య నివారణ అంశాలు ఉన్నప్పటికీ, కొత్త నిబంధనలపై అవగాహన కోసం ప్రత్యేక బుక్‌‌‌‌లెట్లను రూపొందించారు.

హైదరాబాద్‌‌‌‌లోని ఎస్‌‌‌‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్, జీహెచ్‌‌‌‌ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు, ఉపాధ్యాయులతో వర్క్‌‌‌‌షాపులు నిర్వహించి వీటిని సిద్ధం చేశారు. తెలుగు, ఉర్దూ భాషల్లో అనువదించి ఎడిటింగ్ పూర్తి చేసిన ఈ బుక్‌‌‌‌లెట్లను డిసెంబర్ నెలాఖరు నాటికి విద్యార్థులకు పంపిణీ చేయడంతో పాటు ఎస్‌‌‌‌సీఈఆర్టీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోనూ అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులను ‘చెత్త నిర్వహణ అంబాసిడర్లు’గా తీర్చిదిద్ది.. వారి ద్వారా తల్లిదండ్రులు, కాలనీ వాసులకు ఇళ్ల వద్దే చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించనున్నారు.