అడ్డగోలుగా ‘అబార్షన్’ కిట్ల అమ్మకం ..డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్

అడ్డగోలుగా ‘అబార్షన్’ కిట్ల అమ్మకం ..డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్
  • నస్పూర్​లో ఇటీవల ఏడు నెలల గర్భిణికి అబార్షన్ 
  • మృత శిశువును చెట్ల పొదల్లో పడేసిన దుండగులు
  • మెడికల్ షాప్ నిర్వాహకుడు,  మరికొందరిపై కేసు
  • సిఫార్సు చేసిన డాక్టర్ ఎవరు? ఆయనపై చర్యలేవి?
  • పట్టించుకోని డ్రగ్​ కంట్రోల్ అధికారులు

 మంచిర్యాల, వెలుగు: అవాంఛిత గర్భ విచ్ఛిత్తి కోసం ఎంటీపీ (మెడికల్ టర్మినేషన్ అఫ్ ప్రెగ్నెన్సీ) కిట్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. 

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో వీటిని అమ్ముతున్నారు. కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు వీటితో దొంగచాటుగా అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఎంటీపీలపై కంట్రోల్ లేకపోవడంతో ఎవరు పడితే వారు దుర్వినియోగం చేస్తున్నారు. 

మంచిర్యాల జిల్లాలో ఇటీవల ఏడు నెలల గర్భిణికి ఎంటీపీ కిట్​తో అబార్షన్ చేసి పసికందు మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసిన ఘటన సంచలనం రేపింది. దీనిపై నస్పూర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంటీపీ కిట్ అమ్మినట్టు లభించిన ఆధారాలతో ఓ మెడికల్ షాప్ యజమానిపై కేసు పెట్టి జైలుకు పంపించారు. 

ఈ ఘటనలో మరో ఐదుగురిని రిమాండ్​ చేయగా, బెయిల్​పై రిలీజ్​ అయినట్టు సమాచారం. ఓ డాక్టరే ఎంటీపీ కిట్​ను సిఫార్సు చేశాడని, ఈ కేసులో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు జిల్లాలో హాట్ టాపిక్​గా మారాయి. 

ఏడు నెలల గర్భిణికి ఎంటీపీ కిట్​ సిఫార్సు చేసిన డాక్టర్ ఎవరు? ఆయన పేరు బయటకు రాకుండా సెటిల్మెంట్ చేసిందెవరు? అన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా కేసులు నమోదు కాకపోవడంతో బయటకు రావడం లేదని తెలుస్తోంది. 

ప్రాణాలకే ప్రమాదం

గైనకాలజిస్టుల పర్యవేక్షణ లేకుండా ఎంటీపీ కిట్లు వాడడం ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కిట్ వాడినప్పుడు కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, వికారం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. సాధారణ పీరియడ్స్ కంటే ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి లేదా తిమ్మిరి వస్తుంది. రక్తపు గడ్డలతో కూడిన ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. 

అలసట, మైకం, నీరసం, తలనొప్పి వస్తుంది. ఇవి అబార్షన్ జరిగే ప్రక్రియలో భాగంగా కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల పాటు ఉండవచ్చు. కొన్నిసార్లు ఓవర్ బ్లీడింగ్, తీవ్రమైన కడుపునొప్పి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది. 

సెకండ్ డోస్ వేసుకున్న 24 గంటల తర్వాత కూడా బ్లీడింగ్ కాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్‌‌లో గర్భం)కి దారితీస్తుంది. వాస్తవానికి గర్భం 9 వారాలు దాటిన తర్వాత ఎంటీపీ కిట్ వాడటం ఏమాత్రం సేఫ్ కాదు. కానీ కొంతమంది డాక్టర్లు, ఆర్ఎంపీలు కాసుల కక్కుర్తితో రూల్స్​కు విరుద్ధంగా ఎంటీపీ కిట్లు సిఫార్సు చేస్తూ గర్భిణుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. 

నస్పూర్​ ఘటనలో అన్నీ అనుమానాలే.. 

నస్పూర్​ ఘటనలో అబార్షన్​ కోసం వాడిన ఎంటీపీ కిట్​ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు ఓ సైకియాట్రిస్ట్​ హాస్పిటల్​లో మెడికల్​ షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కానీ ఆ షాపులో ఎంటీపీ కిట్లు అమ్మాల్సిన అవసరమే లేదు. 

సైకియాట్రిస్ట్​ దగ్గరికి మానసిక సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఆ రోగాలకు సంబంధించిన మెడిసిన్​ మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ఈ కోణంలో పరిశీలిస్తే.. ఎంటీపీ కిట్​ ఇంకేదో పెద్ద మెడికల్​ షాపు నుంచి బయటకు వచ్చి ఉండాలి. ఇందుకు ఎవరో డాక్టర్​ రెకమండ్​ చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
 

విచ్చలవిడిగా అమ్మకాలు


డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో ఎంటీపీ కిట్ అమ్మడం లీగల్​గా నిషేధం. ఈ కిట్‌‌లోని మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ మాత్రలు ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్’ ప్రకారం షెడ్యూల్--హెచ్ కేటగిరి కిందకి వస్తాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో వీటిని సేల్ చేయాలి. దానికి సంబంధించిన రికార్డులను మెయింటేన్ చేయాలి. 

కానీ చాలామంది ఈ రూల్స్ ఫాలో కావడం లేదు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపుల లైసెన్సుల రద్దు, సస్పెండ్ చేసే పవర్ ఉన్నపటికీ డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారుల వివరణ కోసం ఫోన్ చేస్తే స్పందించలేదు.