తమిళనాడులో అరుణగిరిపై వెలిగిన మహాదీపం 

తమిళనాడులో అరుణగిరిపై వెలిగిన మహాదీపం 

 

  • 2,668 అడుగుల ఎత్తైన కొండ శిఖరాన 
  • 4,500 లీటర్ల నెయ్యితో జ్యోతి
  •     తిరువణ్ణామలైలో ‘అన్నామలైయారుక్కు అరోహరా’ నినాదాలు
  •     ఏడాదికి ఒక్కసారే కార్తీక పౌర్ణమి రోజున అర్ధనారీశ్వరుడి దర్శనం
  •     వానను లెక్కచేయక తరలివచ్చిన లక్షలాది భక్తులు
  •     14 కిలోమీటర్ల గిరివలంలో భక్తజన సంద్రం


 

తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో పది రోజుల కార్తీక దీపోత్సవం మంగళవారం మహా దీపంతో వైభవంగా ముగిసింది. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఆలయం వెనుక ఉన్న 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండ శిఖరంపై మహా దీపం వెలిగించారు. అదే సమయంలో స్వామి సన్నిధి ముందు అఖండ దీపం వెలిగించారు. మహా దీపం వెలగగానే ‘అన్నామలైయారుక్కు అరోహరా’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో తిరువణ్ణామలై మార్మోగింది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ (గిరివలం) మార్గంలో ఉన్న భక్తులు కొండ వైపు తిరిగి మహా దీపానికి మొక్కారు. వాన, ఉక్కపోతను లెక్కచేయకుండా తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు 50 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.

4,500 లీటర్ల నెయ్యి

మహా దీపం కోసం భారీ గంగాళం (కొప్పెరై ), 4,500 లీటర్ల నెయ్యి, వత్తి కోసం నూలు వస్త్రాన్ని భక్తులు సోమవారమే కొండ శిఖరానికి మోసుకెళ్లారు. ఉత్సవాల తొమ్మిదో రోజైన సోమవారం తెల్లవారుజామున ఆలయ రెండో ప్రాకారంలోని చిన్న నంది దగ్గర గంగాళానికి ప్రత్యేక పూజలు చేసి కొండపైకి తీసుకెళ్లారు.

ఏడాదికి ఒక్కసారే అర్ధనారీశ్వర దర్శనం

మంగళవారం తెల్లవారుజామునే ఆలయం తెరిచి పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకం, అలంకరణ, దీపారాధన చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి సన్నిధిలోని అర్ధమండపంలో భరణి దీపం వెలిగించారు. సాయంత్రం పంచమూర్తులు దీప దర్శన మండపంలో కొలువుదీరారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అర్ధనారీశ్వరుడు సన్నిధి నుంచి నృత్యం చేస్తూ బయటికి వచ్చి కొన్ని నిమిషాలు భక్తులకు దర్శనమిచ్చారు. ఆ వెంటనే అఖండ దీపం, మహా దీపం వెలిగించారు. మహా దీపం రోజుతో పాటు మిగతా రోజుల్లోనూ భక్తులు కొండ ఎక్కడాన్ని అధికారులు నిషేధించారు.