సెప్టెంబర్ 30, 2025న గోవాలోని బిస్లరీ తయారీ కేంద్రం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఆరు శాంపిల్స్ సేకరించారు. ఐదు నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది. ఆరో నమూనాలో బ్రోమేట్ స్థాయి 12 మైక్రోగ్రాములు/ లీటరు నమోదైంది. అనుమతించిన పరిమితి 10 మైక్రోగ్రాములు / లీటరు. ఆరో నమూనాలో బ్రోమేట్ స్థాయి 20 శాతం పరిమితిని మించి ఉన్నది. నవంబర్ 22, 2025 నాడు బిస్లరీ దీనిపై అప్పీల్ దాఖలు చేయడంతో ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ ఆ వివాదాస్పద నమూనాను రీ టెస్టింగ్ కోసం రిఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపింది.
బిస్లరీ కథనం ప్రకారం రెఫరల్ ల్యాబ్ ఫలితాలలో బ్రోమేట్ స్థాయిలు సురక్షిత పరిమితుల్లోనే ఉన్నట్లు తేలింది. కానీ అదే నమూనాలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించి ఆ నమూనా సురక్షితం కాదని ప్రకటించింది. ఈ అంశాన్ని ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ కూడా తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరస్పర విరుద్ధమైన ఫలితాల వలన బిస్లరీ ఆ నమూనాను ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ ఆమోదించిన మరో ప్రయోగశాలలో స్వతంత్రంగా పరీక్షించింది. అక్కడ బ్రోమేట్ స్థాయిలు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. ఆ ఫలితాలను ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి ఫిబ్రవరి 2, 2026న అధికారిక లేఖతో సమర్పించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ అనుమతి
వివిధ ప్రయోగశాలలో జరిపిన పరీక్షలలో ఫలితాలు వివిధ రకాలుగా ఉండటంతో 22 నవంబర్ 2026 నాడు.. ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ తన అధికారిక సోషల్ మీడియా ప్రకటన ద్వారా బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. బిస్లరీతోపాటు మరో ఇతర నాలుగు సంస్థలపై కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. బ్రోమేట్ తాగునీటి శుద్ధి సమయంలో ముఖ్యంగా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపడానికి ఓజోన్‌ను ఉపయోగించినప్పుడు ఏర్పడుతుంది.
ఇది నీటి వనరులో సహజంగా ఉండే బ్రోమైడ్ అయాన్‌లతో చర్య జరిపినప్పుడు, ఉప-ఉత్పత్తిగా బ్రోమేట్‌ను ఉత్పత్తి చేస్తుంది. డబ్ల్యూహెచ్‌ఓ తాగునీటి మార్గదర్శకాలు బ్రోమేట్ పరిమాణం లీటరుకు 10 మైక్రోగ్రాముల పరిమితిని నిర్దేశించాయి. బ్రోమేట్ ఒకసారి ఏర్పడిన తర్వాత దానిని తొలగించడం కష్టమని, అందువల్ల నీటి శుద్ధి ప్రక్రియల నియంత్రణ ముఖ్యమని కూడా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. దీర్ఘకాలంపాటు బ్రోమేట్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
100కు పైగా రసాయనాల సమూహం పీఏహెచ్‌లు
తాగునీటి నాణ్యతపై డబ్ల్యూహెచ్‌ఓ తన మార్గదర్శకాలలో బ్రోమేట్‌ను గ్రూప్ 2బిగా వర్గీకరించింది, అంటే ఇది మానవులకు క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఉందని అర్థం. జంతువులపై జరిపిన అధ్యయనాలలో, పొటాషియం బ్రోమేట్‌కు గురైన తర్వాత మూత్రపిండాలు, థైరాయిడ్, ఇతర కణజాలాలలో కణితులు పెరిగినట్లు కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించిన నిర్దిష్ట బిస్లరీ నమూనాలోకి పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (పీఏహెచ్‌లు) ఎలా ప్రవేశించాయో నియంత్రణ సంస్థలు బహిరంగంగా వెల్లడించలేదు. అలాగే ఏ నిర్దిష్ట పీఏహెచ్ సమ్మేళనాలు లేదా వాటి గాఢతలు కనుగొన్నారో బహిరంగ నివేదికలు కూడా వెల్లడించలేదు. సాధారణంగా పీఏహెచ్‌లు పర్యావరణ కాలుష్యం ద్వారా నీటిలోకి ప్రవేశిస్తాయి. పీఏహెచ్‌లు అనేవి 100కు పైగా రసాయనాల సమూహం.
మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ అంటే...
బిస్లరీ వివాదం భారతదేశంలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమపై ఉన్న నియంత్రణ పర్యవేక్షణ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది. భారతదేశంలోని ఆరు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలింది. పరీక్షించిన అన్ని నమూనాలలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు తేలింది. వీటి గాఢత లీటరుకు 808 నుండి 1,888 కణాల వరకు ఉంది. అధ్యయనాల ప్రకారం వీటిలో సుమారు 56.7% ముక్కల (ఫ్రాగ్మెంట్స్) రూపంలో ఉన్నాయి.
గుర్తించిన మైక్రోప్లాస్టిక్‌లలో 91% కంటే ఎక్కువ కణాలు 40 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నాయి. సాధారణంగా 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్‌గా నిర్వచిస్తారు. ఒక మైక్రోమీటర్ కంటే తక్కువ పరిమాణం కలిగిన మైక్రో ప్లాస్టిక్‌లోని ఒక ఉప వర్గాన్ని నానో ప్లాస్టిక్ అంటారు. మైక్రోప్లాస్టిక్స్ వివిధ మార్గాల ద్వారా తాగునీటి వనరుల్లోకి ప్రవేశించవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడం ద్వారా, వాతావరణం నుంచి ప్లాస్టిక్ కణాలు నేలపై, నీటిపై పడటం ద్వారా కూడా మంచినీటి వనరుల్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరతాయి.
సహజ నీటివనరులను కాపాడుకోవాలి
నీటిని నింపే ప్లాస్టిక్ సీసాలు, వాటి మూతలు కూడా మైక్రోప్లాస్టిక్స్‌కు మూలాలు. పూర్వకాలంలో ప్రకృతిలో దొరికే నీటిని ఎటువంటి ఫిల్టరేషన్ ప్రక్రియలు లేకుండా డైరెక్ట్‌గా తాగేవారు. ఆ నీటితో ఆరోగ్యాన్ని పొందేవారు. ప్రస్తుత కాలంలో నీటిని కూడా ఒక నిత్యవసర వస్తువులా కొనవలసి వస్తున్నది. పైసలు ఖర్చుచేసి నీటిని కొన్నప్పటికీ నాణ్యతలేని అనారోగ్య కరమైన నీటిని తాగవలసి వస్తుంది. ప్రజలు ప్రకృతి సిద్ధంగా లభించిన నీటి వనరులను విధ్వంసం చేయడమే ఈ పరిస్థితికి కారణం. నీటిని శుద్ధి చేసే సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అది ప్రకృతి సిద్ధంగా దొరికే నీటి నాణ్యతకు సరిపోదు. ప్రస్తుత బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంఘటనే ఇందుకు ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ప్రజలు సహజ నీటి వనరులను చిత్తశుద్ధితో కాపాడుకోవాలి. ఇదే నాణ్యమైన తాగునీటికి సరైన పరిష్కార మార్గం.
- డా. శ్రీధరాల రాము
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
