బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ..ముగ్గురు స్కావెంజర్స్ మృతి

బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ..ముగ్గురు స్కావెంజర్స్ మృతి
  •   బాచుపల్లిలో విషాద ఘటన
  •     ఒకరి తర్వాత ఒకరు ట్యాంకులోకి  
  • దిగి ప్రాణాలు కోల్పోయిన వైనం
  •     విషవాయువులే కారణమన్న అనుమానాలు? 
  •     బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత 
  •     బాచుపల్లిలో విషాద ఘటన


హైదరాబాద్‌ సిటీ/ కుత్బుల్లాపూర్, వెలుగు: సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) ట్యాంకును శుభ్రం చేస్తుండగా ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు ట్యాంకులోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బాచుపల్లిలోని దినేశ్‌ ఆరిక్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు ఎస్టీపీ ట్యాంకుల నిర్వహణ కోసం హెచ్‌ఆర్‌ ఎన్విరో ప్రొటెక్షన్‌ సిస్టమ్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.

ఇందులో భాగంగా కార్మికులు శణ్ముఖరావు అలియాస్‌ సుమన్‌ (26), సురేశ్‌ (24), పవన్‌ (25) మంగళవారం ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు వచ్చారు. సురేశ్‌ తన బావమరిది తొలుగు బాలసాయిని కూడా వెంట తీసుకొచ్చాడు. పని ప్రారంభించిన సుమన్‌ తొలుత ఎస్టీపీ ట్యాంకులోకి దిగి క్లీన్ చేస్తుండగా కొద్దిసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు పవన్‌,  సురేశ్‌  కూడా లోపలికి దిగారు. ముగ్గురి నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో పైన ఉన్న బాలసాయి భయాందోళనకు గురై తన అన్నకు ఫోన్‌ చేశాడు. పోలీసులు, హైడ్రా సిబ్బంది స్పాట్​కు చేరుకుని సుమారు మూడు గంటల పాటు శ్రమించి ముగ్గురి డెడ్​బాడీలను బయటకు తీశారు. మృతులు  ఏపీలోకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.  బాలసాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

విషవాయువులే కారణమా?

ప్రమాదకరమైన ఎస్టీపీ ట్యాంకులను శుభ్రం చేసేటప్పుడు ప్రత్యేక భద్రతా పరికరాలు, ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ, సేఫ్టీ రోప్స్, గ్యాస్‌ పరీక్షలు తప్పనిసరిగా ఉండాలి. అయితే 20 నుంచి 30 అడుగుల లోతున్న ట్యాంకులోకి కార్మికులను పంపే ముందు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం నిచ్చెన సాయంతోనే కార్మికులను ట్యాంకులోకి పంపించారని స్థానికులు చెబుతున్నారు.  

ట్యాంకులో పేరుకుపోయిన విషవాయువుల ప్రభావంతోనే కార్మికులు అస్వస్థతకు గురై మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తాము స్పాట్​కు చేరుకునేలోపే డెడ్​బాడీలను గాంధీ ఆస్పత్రికి తరలించడంపై మృతుల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో ఇండ్లల్లో సంపులను క్లీన్ చేసే మాదిరిగా ఇక్కడ కార్మికులను లోపలికి దింపారని, భద్రతా లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు కోరుతున్నారు.