భోపాల్: మనుషుల్లో కంటే మూగజీవాల్లోనే విశ్వాసం, కృతజ్ఞత ఎక్కువగా ఉంటాయని మరోసారి రుజువైంది. తనకు రోజూ అన్నం పెట్టిన ఓ వృద్ధుడు మరణించడంతో ఆ వీధికుక్క ఆయన అంతిమయాత్రలో చివరి వరకు తోడుగా నడిచి అందరినీ కంటతడి పెట్టించింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సెహోర్‌కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోహన్‌లాల్ రైక్వార్ (75) గత వారం మృతి చెందారు. ఆయన బతికున్నప్పుడు 'కాలు' అనే వీధికుక్కకు రోజూ అన్నం పెట్టేవారు. దీంతో వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. మోహన్‌లాల్ మరణించాక, కాలు నిశ్శబ్దంగా ఆయన పాడె వెంబడి శ్మశానవాటిక వరకు నడిచింది. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే వేచి ఉంది. అనంతరం సంతాప సభలో బంధువులతోపాటు కూర్చుని మౌనంగా నివాళులర్పించింది. ఆ తర్వాత వారింటికి కూడా వెళ్లి కాసేపు ఉండి, నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
గత జులైలో మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ప్రదీప్ జైన్(67) మరణించగా, ఆయన పెంచుకున్న 'డుగ్గు' అనే కుక్క యజమాని అంతిమయాత్రలో కొద్దిదూరం నడిచి, ఆ ఎడబాటును తట్టుకోలేక కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
