- యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. 24 మంది విద్యార్థులు సహా మొత్తం 32మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశాంబిలోని ఓరియంటల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థులు, సిబ్బంది తాజ్‌మహల్ విహారయాత్ర ముగించుకుని బస్సులో తిరిగి వస్తున్నారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు తాథియా సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వే పక్కన విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు.. బస్సును ఢీకొట్టడంతో వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 24 మంది విద్యార్థులు, ఎనిమిది మంది స్కూల్ సిబ్బంది మొత్తం 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) సిబ్బంది, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ధ్వంసమైన బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని మెడికల్ కాలేజీకి తరలించగా, అప్పటికే నలుగురు విద్యార్థులు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
