సరిహద్దులో చైనా కుట్ర..మెయిన్‌‌‌‌ లింగ్ వద్ద భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు

సరిహద్దులో చైనా కుట్ర..మెయిన్‌‌‌‌ లింగ్ వద్ద భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు
  • 'ఎర్త్‌‌‌‌సెన్స్ ల్యాబ్స్' శాటిలైట్ సర్వేలో బట్టబయలైన చైనా కుతంత్రం

గువాహటి: దేశ సరిహద్దులో చైనా డ్యామ్ కుట్రకు తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను స్పీడప్ చేసింది. యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై 60 వేల మెగావాట్ల సామర్థ్యంతో 'మెడాగ్' పేరిట చైనా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇందుకోసం ఏకంగా 168 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది.

ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన 'ఎర్త్‌‌‌‌సెన్స్ ల్యాబ్స్' అనే సంస్థ మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలపై సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా 2018 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు సేకరించిన శాటిలైట్ ఫొటోలను పోల్చి చూసింది. ‘‘బిల్డింగ్ ఎట్ ది గ్రేట్ బెండ్: మానిటరింగ్ చైనాస్ 60 జీడబ్ల్యూ మెడాగ్ డ్యామ్ ప్రాజెక్ట్’’ పేరిట ఈ నెల 22న నివేదికను విడుదల చేసింది.

రిపోర్ట్ ప్రకారం..ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతమైన టిబెట్‌‌‌‌లోని మెయిన్‌‌‌‌లింగ్ వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. గతేడాది జూలై వరకు అక్కడ పంట పొలాలు, ఇళ్లు ఉండేవి. కానీ డిసెంబర్ నాటికి వాటన్నింటినీ ఖాళీ చేయించి మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి నది ఉత్తర ఒడ్డున కొత్త రోడ్లు, తాత్కాలిక నివాసాలు, ఆఫీసులు వెలిశాయి. నది నీటిని మళ్లించేందుకు కూడా చైనా సన్నాహాలు చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది.

అరుణాచల్, అస్సాం రాష్ట్రాలకు ముప్పు!

చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ నది అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లో 'సియాంగ్' పేరుతో ప్రవేశించి.. ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. భారత్, చైనా దేశాల మధ్య ఎలాంటి కచ్చితమైన నీటి పంపిణీ ఒప్పందం లేదు. కొత్త డ్యామ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో నీటి ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. చైనా ఎప్పుడంటే అప్పుడు నీటిని నిలిపివేయడం లేదా ఒక్కసారిగా విడుదల చేయడం చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.