వెహికల్ పూలింగ్ చేయండి.. ఒకే రూట్లో కలిసి వెళ్లండి  

వెహికల్ పూలింగ్ చేయండి.. ఒకే రూట్లో కలిసి వెళ్లండి  
  •    పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​వినియోగించండి
  •     ఈ ఐడియాలతో ట్రాఫిక్​    రద్దీకి చెక్​ పెట్టొచ్చు  
  •     సైబరాబాద్ సీపీ రమేశ్​
  •     26 నుంచి టీ హబ్​లో సైబరాబాద్​ మూవ్స్​
  •     పోస్టర్​ రిలీజ్​ చేసిన కమిషనర్​ 

గచ్చిబౌలి, వెలుగు : ‘ఒక వాహనంలో ఒక్కరే ప్రయాణించే పద్ధతికి స్వస్తి పలకండి. ఒకే రూట్​లో వెళ్లేవారు ఐదుగురు ఒకే కారులో, ఇద్దరైతే ఒకే బైక్​పై వెళ్లేలా ప్లాన్​చేసుకుంటే ట్రాఫిక్​రద్దీని అరికట్టినవాళ్లవుతారు. ఇలా వీలు కాని పక్షంలో పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​ను వినియోగించుకోవాలి’ అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్​ఎం రమేశ్​ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా జరగనున్న ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ పై మంగళవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబరాబాద్‌‌లో ఉండే వారు, జాబ్స్​చేసేవాళ్లు..ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోయేవారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిల్లలను స్కూల్​లో దింపేందుకు, తీసుకువచ్చేందుకు కార్లను వాడే తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. తాము సైకిళ్లపై వచ్చేవారికి ప్రత్యేక రూట్​క్రియేట్​చేయడంతో పాటు సురక్షిత ప్రయాణంతో పాటు ఆటంకం లేని రాకపోకలకు వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల వద్ద ఉన్న సమాచారం, సీసీటీవీ కెమెరాలు, వాహనాల లెక్కలు తీసి ప్రతి రూట్​లో గతంలో ఉన్న రద్దీ..ఈ మూడు రోజులతో పోల్చి, రద్దీ లేని రహదారులను ప్రత్యక్షంగా చూపిస్తామని వెల్లడించారు.  

 ఆ ఏరియా నుంచే 65 శాతం మంది  

జేఎన్‌‌టీయూ నుంచి ఐకియా ఐటీ కారిడార్ వైపు గంట, గంటన్నర వ్యవధిలోనే దాదాపు 65 శాతం మంది వస్తున్నారని, దీంతో రోడ్లు స్తంభించిపోతున్నాయని సీపీ చెప్పారు. ఆ టైంలో ఆర్టీసీ సహకారంతో అధిక సంఖ్యలో బస్సులు నడిపి ప్రజారవాణాను వినియోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపిస్తామన్నారు. నెల రోజులుగా రెసిడెన్సి వెల్ఫేర్​అసిసోయేషన్స్, ఐటీ కంపెనీలు, దవాఖానలు, ఇతర భాగస్వామ్య వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపామని, ఫీనిక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు ఉద్యోగుల్లో కార్‌‌పూలింగ్‌‌ను ప్రోత్సహించేందుకు, ప్రోత్సాహకాలు అందించే అవకాశాలను పరిశీలించేందుకు ముందుకొచ్చాయని వివరించారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ, హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్, హెచ్‌‌ఎండీఏ ఈ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాయని సీపీ వెల్లడించారు. అనంతరం సైబరాబాద్​మూవ్స్​పోస్టర్​ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, కూకట్‌‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్- I డీసీపీ డా.ఎస్.రవికుమార్, ట్రాఫిక్ వన్​అడిషనల్​డీసీపీ హనుమంత రావు, ఎస్సీఎస్‌‌సీ సీఈఓ నవీద్ ఆలం ఖాన్ పాల్గొన్నారు.అంతకుముందు సైబరాబాద్​ మూవ్స్​ కార్యక్రమ ఏర్పాట్లను సీఎంసీ కమిషనర్‌‌ సృజనతో కలిసి సీపీ రమేష్, సొసైటీ ఫర్‌‌ సైబరాబాద్‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ ప్రతినిధులు, ట్రాఫిక్‌‌ పోలీస్‌‌, సీఎంసీ అధికారులు మంగళవారం
 పరిశీలించారు.