హైదరాబాద్: జాతీయస్థాయిలో నిర్వహించిన స్టార్ మిస్ టీన్ ఇండియా–2026 అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. జైపూర్‌లోని జెడ్ స్టూడియోస్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 31 మంది యువతులు పాల్గొన్నారు. వారిలో రిషిత తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
మూడు నెలల శిక్షణతో తొలి విజయం
హైదరాబాద్‌లోని ఒబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న రిషితకు అందాల పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. తల్లిదండ్రులు ప్రత్యూష, రామకృష్ణ ప్రోత్సాహంతో మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
తన విజయంపై రిషిత సంతోషం వ్యక్తం చేసింది. జాతీయస్థాయి అందాల పోటీల్లో తెలుగు యువతులు తక్కువ సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో, తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.అందాల పోటీలు అంటే కేవలం అందం, అలంకరణ మాత్రమే కాదని పేర్కొంది. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అంశాలపై అవగాహన కూడా ఎంతో ముఖ్యమని వివరించింది. ఈ పోటీల ద్వారా వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం
అందాల పోటీలపై సమాజంలో ఉన్న అపోహలు తొలగాలని రిషిత అభిప్రాయపడింది. ఆసక్తి ఉన్న విద్యార్థినులను తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రోత్సహిస్తే వారు ఉన్నత విజయాలు సాధించగలరని పేర్కొంది. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో జరిగే అందాల పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని వెల్లడించింది. ఇందుకోసం ప్రస్తుతం మరింత మెరుగైన శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన రిషిత పెన్మెత్సకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
