పంజాబ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ  ఒక్కటైన బీజేపీ, అకాలీదళ్ 

పంజాబ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ  ఒక్కటైన బీజేపీ, అకాలీదళ్ 
  • ఆరేండ్ల తర్వాత ఎన్డీయేలోకి శిరోమణి అకాలీదళ్
  •     2027 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని నేతల వెల్లడి
  •     అకాలీదళే ‘బడా భాయ్’.. సీఎం ఆ పార్టీ నుంచే: అమిత్ షా
  •     హిందూ-సిక్కు సోదరభావానికి ప్రతీక అన్న ప్రధాని మోదీ 

 

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై ఆరేండ్ల కింద విడిపోయిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఒక్కటయ్యాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్ సంయుక్త మీడియా సమావేశంలో ఈ పొత్తును ప్రకటించారు. ‘పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, అకాలీదళ్ నిర్ణయించాయి. ఈ రోజు నుంచే అకాలీదళ్ ఎన్డీయేలో చేరుతోంది. ఎన్డీయేలోని అత్యంత పాత మిత్రపక్షం తిరిగి రావడం చాలా సంతోషం’ అని అమిత్ షా అన్నారు. ఈ పొత్తు హిందూ–సిక్కు సోదరభావానికి ప్రతీక అని ప్రధాని మోదీ అభివర్ణించారని, అకాలీదళ్ తిరిగి రావడంపై ఆయన ఎంతో సంతోషించారని షా చెప్పారు. రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాయన్నారు. గురునానక్ జయంతి (గురుపూరబ్) రోజునే ఈ ప్రకటన రావడం విశేషం.
 
అకాలీదళే బడా భాయ్

కూటమి సీఎం అభ్యర్థి ఎవరని మీడియా అడగ్గా, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అకాలీదళే ‘బడా భాయ్’ (పెద్దన్న) పాత్ర పోషిస్తుందని, సీఎం కూడా ఆ పార్టీ నుంచే ఉంటారని అమిత్ షా చెప్పారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 117 అసెంబ్లీ స్థానాల్లో గతంలో పొత్తులో ఉన్నప్పుడు అకాలీదళ్ 94, బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటికొచ్చింది. ఈ కొత్త కూటమి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. బీజేపీ–అకాలీదళ్ పొత్తు ‘దిశ లేని కూటమి’ అని ఆప్ విమర్శించింది.