- త్వరిత విచారణ హక్కుతో పాటు సమాజ ప్రయోజనమూ ముఖ్యమే
- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నేర చరిత్ర ఉండి, గతంలో శిక్ష పడిన నేరస్తుడికి కేవలం త్వరిత విచారణ హక్కు ఆధారంగా బెయిల్ ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ హత్య కేసు నిందితుడికి పంజాబ్–హర్యానా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌తో కూడిన బెంచ్ ఈ నెల 18న రద్దు చేసింది.
చంపడానికి ప్రయత్నించిన వ్యక్తినే..
నిందితుడు ఐదేండ్లకు పైగా జైలులో ఉన్నాడనే కారణంతో ఈ ఏడాది జనవరిలో పంజాబ్–హర్యానా హైకోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హత్యకు గురైన వ్యక్తి తండ్రి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. నిందితుడు గతంలో హత్యాయత్నం కేసులో దోషిగా తేలాడని, అతడి నేర చరిత్రను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. నేర చరిత్రను బెయిల్ పిటిషన్లోనే పేర్కొన్నామని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు.
కానీ ఈ కేసు తప్ప తనపై ఇతర కేసులేవీ లేవని పిటిషన్లో నిందితుడు రెండుచోట్ల రాశాడని సుప్రీంకోర్టు గుర్తించింది. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తినే గతంలో చంపేందుకు ప్రయత్నించిన కేసులో అతడికి శిక్ష పడిందని, ఆ విషయాన్ని దాచిపెట్టాడని పేర్కొంది. ఆ హత్యాయత్నం కేసులో బెయిల్‌పై ఉండగానే ఈ హత్య చేశాడని, అతడి పాత శిక్ష, ఇతర కేసుల సంగతి హైకోర్టు దృష్టికే రాలేదని తెలిపింది.
సమాజ ప్రయోజనమూ ముఖ్యమే
‘త్వరిత విచారణ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమే. కానీ నిందితుడు దారుణ నేరానికి పాల్పడినప్పుడు, అతడి హక్కుతో పాటు సమాజం, బాధితుడు, అతడి కుటుంబ ప్రయోజనాలను కూడా చూడాలి’ అని బెంచ్ పేర్కొంది. వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా హైకోర్టు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి బెయిల్ పొందినప్పుడు, త్వరిత విచారణ హక్కుకు, సమాజ ప్రయోజనాలకు మధ్య సమతూకం పాటించడం కోర్టుల బాధ్యత అని స్పష్టం చేసింది. ఇలాంటి నిందితుడికి విచారణ పెండింగ్‌లో ఉండగా హైకోర్టు బెయిల్ ఇవ్వాల్సింది కాదని పేర్కొంటూ, ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. వారంలోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది.
