న్యూఢిల్లీ: ఇండియా ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయకూడదని దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష నిర్ణయించుకుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువైన మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె పత్రాలు సమర్పించకపోవడంతో నాలుగేళ్ల పదవీకాలానికి తెరపడింది. దీంతో డిసెంబర్ 5న జరగనున్న ఎన్నికల తర్వాత ఐవోఏకు కొత్త అధ్యక్షుడు రానున్నారు. 2022 డిసెంబర్ 10న ఉష ఐవోఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది.
తాజాగా అధ్యక్ష పీఠం కోసం ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్, ఇండియా ఆర్చరీ సంఘం (ఏఏఐ) కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవా, ఐవోఏ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహతా మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన అత్యుత్తమ క్రీడాకారుల (ఎస్‌వోఎం) ఎన్నికల్లో ఉష ఓటమిపాలైంది. బయటి శక్తుల ఒత్తిడితోనే తనను ఓడించారని ఆరోపిస్తూ ఐఓసీకి లేఖ కూడా రాసింది.
ఆ తర్వాత ఇండియా ఐస్ హాకీ సంఘం (ఐహెచ్ఏఐ) ప్రతినిధిగా ఎలక్టోరల్ కాలేజీలో చేరేందుకు ఎన్నికల అధికారి సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అనుమతించినా, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. కోశాధికారి పదవికి మాజీ టేబుల్ టెన్నిస్ ఆటగాడు కమలేష్ మెహతా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైంది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బరిలో దిగుతారనే ప్రచారం జరిగినా, ఆమె నామినేషన్ దాఖలు చేయలేదు.
