అత్యంత క్రూరమైన నేరాలలోని దోషులకి బెయిల్ ఇచ్చే విషయంలో బెయిల్‌లాంటి ఉపశమనాలను సుప్రీంకోర్టు అంత సులువుగా ఇవ్వదు. కొంచెం కఠిన వైఖరిని అవలంబిస్తుంది. ఇందులో కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె బంధువులు కూతురు హత్యకు గురికావడంలాంటి నేరాలు మామూలు నేరాలు కాదు. అవి అత్యధిక క్రూరమైన నేరాలు. అందులోని నేరస్తులందరికీ శిక్షపడింది. ఆ కేసులోని 11మంది దోషులలో ఇద్దరికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆ ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. ఈ దోషులకి బెయిల్ మంజూరు చేయడం వల్ల కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శిక్షపడిన వ్యక్తులకి బెయిల్ ఎప్పుడు మంజూరు చేయవచ్చు. దానికి ఎవరు అర్హులు? దానిని ఎలా నిర్ధారించాలి. బెయిల్ విచారణ ప్రక్రియలో బాధితురాలు పాల్గొనవచ్చా? తన వాదనని వినిపించవచ్చా? అన్న ప్రశ్నలు మళ్లీ తెరమీదకి వచ్చాయి.
బెయిల్ విచారణ ప్రక్రియలోనే కాదు. కేసు ప్రతిదశలో బాధితురాలు తమ వాదనని వినిపించవచ్చు. ఆ విచారణ ప్రక్రియలో ఆమె పాల్గొనవచ్చు. జగజ్జీత్ సింగ్ మరి ఇతరులు వర్సెస్ ఆశీష్ మిశ్రా @ మోను మరి ఒకరు (2022) కేసులో సుప్రీంకోర్టు బాధితుల హక్కులను ప్రస్తావించి, విచారణలోని ప్రతి దశలోనూ బాధితురాలి వాదనను వినిపించే హక్కు కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే శ్రీమతి ఎక్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2023) కేసులో ఈ హక్కు మరీ ముఖ్యంగా లైంగిక దాడి బాధితులకి ఉంటుందని కోర్టు పునరుద్ఘాటించింది.
భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఈ హక్కులను పొందుపరిచింది. ‘బాధితుడు’ అన్న నిర్వచనాన్ని సంరక్షకుడు లేదా చట్టపరమైన వారసులు అని చేర్చి విస్తరించింది. అందుకే ఈ కేసులో ముద్దాయిలిద్దరికీ బెయిల్ మంజూరు చేసిన తర్వాత బిల్కిస్ బానో ఇలా అన్నారు. ‘నేను మళ్లీ భయభ్రాంతులకి లోనవుతున్నాను. నా గురించి, నా పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి భయపడుతున్నాను. కోర్టులో నా వాదనని వినకుండా బెయిల్ ఎలా మంజూరు చేస్తారు’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
వెల్లువెత్తిన ప్రజాగ్రహం
ఈ బెయిల్ ఉత్తర్వులను వ్యతిరేకించాలని బిల్కిస్ బానో నిర్ణయించుకున్నారు. తన బెయిల్ మంజూరుకు సంబంధించిన విచారణలో పాల్గొనడానికి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ఆమెకు సంపూర్ణ హక్కు ఉంది. ఇది సుప్రీంకోర్టు గతంలో అంగీకరించింది. అయినా ఆమె వాదనను వినకుండా బెయిల్ సుప్రీంకోర్టు ఎలా మంజూరు చేసిందోనన్నది అర్థంకాని విషయం. ఈ కేసులోని నేరం అత్యంత ఘోరమైనది. బాధితురాలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. న్యాయం కోసం ఆమె ప్రయాణం హృదయ విదారకంగా కొనసాగింది. 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యుల్లో 13మంది చనిపోయారు. అప్పుడు గర్భవతిగా ఉన్న బానో లైంగిక దాడికి గురయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ కొనసాగితే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న భయాల మధ్య కేసును మహారాష్ట్రకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేసుని విచారించిన ట్రయల్ కోర్టు 2008లో 11మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. బొంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పుని సమర్థిస్తూ శిక్షలను ఖరారు చేశాయి.
2022లో గుజరాత్ ప్రభుత్వం ఆ 11మంది దోషులకి శిక్ష తగ్గించి విడుదల చేసింది. ఆ తరువాత వారిని బహిరంగంగా సత్కరించారు. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. సుప్రీంకోర్టు బెంచ్ జోక్యం చేసుకుని శిక్ష తగ్గింపుని రద్దు చేసింది. ఆ తరువాత వారు తిరిగి జైలుకి వెళ్లారు. అయితే బెయిల్ అప్పీలు పెండింగ్‌లో ఉండగానే 11మంది దోషులలో ఇద్దరిని బెయిల్ మీద సుప్రీంకోర్టు విడుదల చేసింది. అంతేకాదు శిక్షను కూడా సస్పెండ్ చేసింది. అప్పీలుని విన్న తరువాత సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇదిలా ఉండగా సమానత్వం ప్రాతిపదికన మిగిలిన దోషులు కూడా బెయిల్ కోసం అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది.
బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు
బెయిల్ అనేది నియమం. జైలు అనేది మినహాయింపు ఈ సూత్రం న్యాయవ్యవస్థలో ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో పునరుద్ఘాటించింది. అయితే విచారణలో ఉన్న ఖైదీల విషయంలో వర్తిస్తుంది. కానీ శిక్షపడిన దోషుల విషయంలో అంతగా వర్తించదు. శిక్షను నిలిపివేయడానికి వాళ్ల సుదీర్ఘ కారాగార శిక్షను (17 సంవత్సరాలు) కోర్టు ఒక కారణంగా పేర్కొంది. దోషులలో ఒకరికి శారీరక బలహీనత ఉందని కోర్టు పేర్కొంది. ఇంతకంటే తీవ్రమైన వైకల్యాలు ఉండి తక్కువ స్థాయి నేరాలు చేసిన వ్యక్తులు, శిక్షపడిన వ్యక్తులు జైళ్లల్లో ఎంతోమంది ఉన్నారు. వృద్ధులైన నిందితులు, తీవ్ర వైకల్యాలు ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ కేసులలోని తీవ్రతనుబట్టి కోర్టులు బెయిల్‌ను తిరస్కరించాయి. బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యలాంటి నేరాలు రుజువైనాయి. అయినా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీంకోర్టు ఏమి ఆదేశించింది?
ఇద్దరు అప్పీలుదారులకి (దోషులకి) జీవిత ఖైదు శిక్షలను నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే 17 సంవత్సరాలకిపైగా జైలు శిక్షను అనుభవించారు. ఆ ఇద్దరిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉంది. ఈ అప్పీలులో కేసులోని విషయాలకు సంబంధించి చట్టానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విచారణ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేయడమైనది.
దోషుల తరఫున వాదనలు
అప్పీలుదారుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ బాత్రా ప్రకారం మోదియా పేరు ఎఫ్ఐఆర్‌లో లేదని మూడేళ్ల తరువాత అతడిని కేసులో చేర్చారని, మరో దోషి జోషి కాలికి శస్త్ర చికిత్స జరిగిందని అతనికి వైకల్యం ఉందని ప్రత్యేకంగా చెప్పారు. ప్రథమ సమాచార నివేదిక అనేది ఎన్‌సైక్లోపీడియా కాదు. అందులో నేరానికి, నేరస్తులకి సంబంధించిన అన్ని వివరాలు ఉండే అవకాశం లేదు. కేసు దర్యాప్తులో ఆ విషయాలు తెలుస్తాయి. అయినా సుప్రీంకోర్టు శిక్షపడిన ఇద్దరు దోషులకి బెయిలును మంజూరు చేసింది. అత్యంత క్రూరమైన నేరాలలోని దోషులకి బెయిలు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు అత్యంత ఉత్సుకతని ప్రదర్శించదు.
సుప్రీంకోర్టు ఈ విషయంలో సంప్రదాయ వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. కొన్ని సందర్భాలలో మినహాయింపులను ఇస్తుంది. ఈ విషయంలో కోర్టు స్థిరత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. బెయిల్ ఇచ్చే విషయంలో ఇంకా అస్పష్టత ఉంది. ఇది విచారణలో ఉన్న ఖైదీల విషయంలోనే కాదు. శిక్షపడిన దోషుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇది పక్షపాతంగా అంటే సెలెక్టివ్ కేసులలో ఇచ్చినట్టుగా అనిపించకూడదు. దోషి సుదీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు, అప్పీలు త్వరలో విచారణకు వచ్చే అవకాశం లేనప్పుడు న్యాయస్థానాలు శిక్షను నిలిపివేసి బెయిలు ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. కానీ తీవ్రమైన నేరారోపణలు రుజువైన కేసుల్లో బెయిలు మంజూరు చేయడం సహజంగానే వివాదాస్పదం అవుతుంది. మరీ ముఖ్యంగా బాధితుల వాదనలు వినకుండా బెయిలు మంజూరు చేయడం వల్ల ఈ ఉత్తర్వులు మరింత చర్చనీయాంశంగా మారినాయి.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
