- జహీరాబాద్ బైపాస్‌పై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు
- విదేశాలకు వెళ్లిన కొడుకు.. తిరిగిరాని లోకాలకు అమ్మానాన్న
- మహారాష్ట్రకు చెందిన శరణప్ప, సుష్మ మృతి
- జహీరాబాద్ బైపాస్‌పై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు
రాయికోడ్,(జహీరాబాద్)/ వైరా, వెలుగు: కొడుకును విదేశాలకు పంపించాలని వెళ్లిన తల్లిదండ్రులు అనంతలోకానికి చేరుకున్నారు. ఎంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి కొడుకును విమానం ఎక్కించారు. విదేశాల్లో చదువు కోసం వెళ్లిన కొడుకు భవిష్యత్‌ను తలుచుకుంటూ ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆ దంపతుల ప్రాణాలను బలిగొంది. విమానం ఎక్కిన కొడుకుకు అమ్మానాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న చేదు వార్త ఎదురైంది. మరోవైపు దైవదర్శనం చేసుకుని ఇంటికి తిరిగొస్తున్న మరో జంట కూడా రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఇలా రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపిన ఈ ఘటనలు సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం జరిగాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
డీసీఎంను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి..
జహీరాబాద్ పట్టణ బైపాస్‌పై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా మురుం గ్రామానికి చెందిన శరణప్ప (61), సుష్మ (49) దంపతుల కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన అతడిని తిరిగి విదేశాలకు పంపించేందుకు మంగళవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కొడుకును విమానం ఎక్కించి కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. జహీరాబాద్ బైపాస్‌లోని ఓ టిఫిన్ సెంటర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శరణప్ప, సుష్మ చనిపోగా.. డ్రైవర్ అజుమొద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే దంపతులు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్టౌన్ఎస్ఐ లవకుమార్ చెప్పారు.
లారీని ఢీకొని మరో జంట అనంతలోకానికి...
వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద మంగళవారం మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన కోట వెంకట కిషోర్‌రెడ్డి (53), భార్య లావణ్య (48), కొడుకు ప్రణీత్‌రెడ్డి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కిషోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న కొడుకు ప్రణీత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రణీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
