కర్రెగుట్టల్లో బాంబుల భయం టూరిజానికి బ్రేక్..ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటన

కర్రెగుట్టల్లో బాంబుల భయం టూరిజానికి బ్రేక్..ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటన
  • రోడ్లు, వాచ్‍ టవర్‍ నిర్మాణానికి పోలీసు పెద్దల శంకుస్థాపన
  • ఆగని పేలుళ్లతో బలైతున్న పోలీసు బలగాలు, స్థానికులు  
  • పెద్దఎత్తున బయటపడుతున్న రాకెట్‍ లాంచర్లు, ల్యాండ్‍మైన్లు
  • కర్రెగుట్టల వైపు పర్యాటకులు రావద్దు : డీజీపీ సీవీ ఆనంద్ 

వరంగల్‍/వెంకటాపురం (వాజేడు), వెలుగు: తెలంగాణ-– ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని దట్టమైన అడవులు, కొండలు, లోయలు, జలపాతాలతో ప్రకృతి అందాలకు నెలవైన కర్రెగుట్టలను టూరిజం స్పాట్​గా తీర్చిదిద్దాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 

మావోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌’లో భాగంగా భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో విస్తృతంగా కూంబింగ్‌‌‌‌ నిర్వహించాయి. పలువురు మావోయిస్టు నేతలను మట్టుబెట్టాయి. మరికొందరు లొంగిపోయారు. దీంతో కర్రెగుట్టలపై జాతీయజెండా ఎగురవేసి ఈ ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించారు.

టూరిజం స్పాట్‍గా ప్రకటన.. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ 5న తెలంగాణ డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి, పీసీసీఎఫ్‌‌‌‌ సువర్ణ కర్రెగుట్టల్లో పర్యటించి ఎకో టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రహదారులు నిర్మించి వ్యూ పాయింట్లు, జంగిల్‌‌‌‌ సఫారీ, ట్రెక్కింగ్‌‌‌‌, జంగిల్‌‌‌‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అందుకోసం ఫార్వర్డ్‌‌‌‌ బేస్‌‌‌‌ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 145 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న కర్రెగుట్టల్లో 29 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పామునూరు నుంచి తడపల వరకు రోడ్డు నిర్మించారు. వాచ్‌‌‌‌టవర్‌‌‌‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.

మందుపాతరల ముప్పు..

మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించినప్పటికీ కర్రెగుట్టల్లో మందుపాతరల ముప్పు పోలేదు. రోడ్ల నిర్మాణం సందర్భంగా 14 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేశారు. మందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో జరిగిన పేలుళ్లలో డీఆర్‌‌‌‌జీకి చెందిన తొమ్మిది మంది, కోబ్రా జవాన్‌‌‌‌ ఒకరు గాయపడ్డారు.

 పామునూరు బేస్‌‌‌‌ క్యాంపు సమీపంలోనూ ఓ సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌ గాయపడ్డాడు. మరోవైపు సెప్టెంబర్‌‌‌‌ 2న వెదురు బొంగుల సేకరణకు తడపల గుట్టలకు వెళ్లిన నూగూరు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (58) మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించి మృతి చెందాడు. పలుచోట్ల పశువులు కూడా మందుపాతరలకు బలైనట్లు సమాచారం.

ఆయుధ డంపుల స్వాధీనం..

భద్రతా బలగాల కూంబింగ్‌‌‌‌ కొనసాగుతుండగా కర్రెగుట్టల్లో భారీ ఆయుధ డంపులు బయటపడుతున్నాయి. ఈ నెల 6న బీజాపూర్‌‌‌‌ పోలీసులు, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌, కోబ్రా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌‌‌‌లో 711 బీజీఎల్‌‌‌‌ సెల్స్‌‌‌‌, ల్యాండ్‌‌‌‌మైన్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. పూజారి కాంకేర్‌‌‌‌ గ్రామ సమీపంలో మరో డంపులో 455 ఎలక్ట్రిక్‌‌‌‌, 500 నాన్‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌ డిటోనేటర్లతో పాటు కమ్యూనికేషన్‌‌‌‌ పరికరాలు, బ్యాటరీలు, ఇతర సామగ్రిని గుర్తించారు.

మావోల లొంగుబాట్లు వ్యూహాత్మకమా? 

మావోయిస్టు నేతలు లొంగిపోయినట్లు ప్రకటించినప్పటికీ, పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయినట్లు అధికారిక ప్రకటన లేదు. ముఖ్య నేత గణపతితో పాటు మరికొందరి ఆచూకీ తెలియకపోవడం, భారీ ఆయుధ డంపులు బయటపడుతుండటంతో లొంగుబాట్లు వ్యూహాత్మకమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కూంబింగ్‌‌‌‌లు కొనసాగుతుండటం పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదనే సందేహాలు ఉన్నాయి. 

 టూరిస్టులకు నో ఎంట్రీ..

మందుపాతరల ముప్పు, వరుస కూంబింగ్‌‌‌‌లు, ఆయుధ డంపుల వెలికితీతతో కర్రెగుట్టల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. గిరిజనులే గుట్టల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పర్యాటకులకు వ్యూ పాయింట్​గా భావించిన వాచ్‌‌‌‌టవర్‌‌‌‌, భవనాల నిర్మాణాలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజలు గుట్టల్లోకి వెళ్లవద్దని బీజాపూర్‌‌‌‌ ఏఎస్పీ రాహుల్‌‌‌‌ బన్సాల్‌‌‌‌ హెచ్చరించారు. 

తెలంగాణ డీజీపీ ఆనంద్‌‌‌‌ సైతం మందుపాతరల ముప్పు తొలగే వరకు పర్యాటకులను అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో ప్రకృతి అందాలకు నిలయమైన కర్రెగుట్టలు టూరిజం స్పాట్​గా మారాలంటే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.